భారత్ పై దాడులకు ఐ.యస్.ఐ.యస్. కుట్రలు?
Publish Date:Jul 29, 2015
Advertisement
ఇదివరకు ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో అల్-కాయిద ఉగ్రవాద సంస్థ యావత్ ప్రపంచాన్నిగడగడలాడించింది. ఆ తరువాత ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ దేశాలలో తాలిబన్లు వరుస బాంబు ప్రేల్లుళ్ళు జరుపుతూ చెలరేగిపోతున్నారు. అగ్నికి వాయువు తోడయినట్లు వారికిప్పుడు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐ.యస్.ఐ.యస్. తోడయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇటీవల అమెరికాలో ఒక పాకిస్తానీ వ్యక్తి వద్ద అక్కడి నిఘా వర్గాలు ఉర్దూలో వ్రాయబడిన 32 పేజీల చిన్న పుస్తకాన్ని స్వాధీనం చేసుకొన్నాయి. ఆ లేఖలో వివరాలనీ సేకరించిన ప్రముఖ అమెరికా పత్రిక యు.యస్.ఏ.టుడే నిన్నటి సంచికలో ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాద సంస్థ మున్ముందు భారత్ పై దాడులు చేసేందుకు ప్రణాలికలు రచిస్తున్నట్లు పేర్కొంది. ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు మున్ముందు చాలా భయంకరమయిన దాడులు చేయబోతున్నట్లు ఆ పుస్తకంలో వ్రాసినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఈ ప్రపంచంలో ఉన్న ఒక బిలియన్ ముస్లిం ప్రజలందరికీ నాయకులుగా తమను ఉగ్రవాద సంస్థలన్నీ గుర్తించాలని ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు ఆ పుస్తకంలో కోరినట్లు పత్రిక తన కధనంలో పేర్కొంది. తమ పోరాటాన్ని మరింత ఉదృతంగా చేసేందుకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో ఉన్న తాలిబన్లు అందరూ ఏకమవ్వాలని ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు కోరినట్లు ఆ పత్రికలో పేర్కొంది. అమెరికా నిఘా వర్ఘాలు స్వాధీనం చేసుకొన్న ఆ పుస్తకానికి “ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ధ ఇస్లామిక్ స్టేట్ ఖలీఫా, ద ఖలీఫా ఎకార్డింగ్ టు ప్రోఫెట్” అనే పేరున్నట్లు ఆ పత్రిక పేర్కొంది. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులతో సతమతమవుతున్న భారతదేశానికి ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు విసురుతున్న ఈ సవాళ్ళని ఎదుర్కోవడానికి చాలా గట్టి సన్నాహాలు, ప్రయత్నాలు చేయాల్సిఉంటుంది. జమ్మూ లో ఇటీవల కాలంలో తరచూ పాకిస్తాన్, ఐ.యస్.ఐ.యస్. జెండాలు రెపరెపలాడుతున్నాయి. అంటే ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు ఇంచుమించు మన గుమ్మం వద్దకు వచ్చేసినట్లే భావించవచ్చును. కనుక భారత ప్రభుత్వం అటువంటి ప్రయత్నాలను ఉక్కుపాదంతో అణచివేయాలి. లేకుంటే తరువాత చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లే అవుతుంది.
http://www.teluguone.com/news/content/isis-terror-gang-45-48750.html





