వెంకయ్యకి రాష్ట్రపతి పదవి?.. బీజేపీ ఆపరేషన్ సౌత్?
Publish Date:Mar 14, 2022
Advertisement
యూపీలో గెలిచింది. ఉత్తరాదిన తిరుగులేదని బీజేపీ మరోసారి నిరూపించుకుంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. నార్త్ ఓకే.. మరి సౌత్ పరిస్థితి ఏంటి? ఎంతగా ఎరువు వేస్తున్నా.. కర్నాటక మినహా ఎక్కడా కమలం పూదోట వికసించడం లేదు. తెలంగాణలో మాత్రం కమలదళం దూకుడు మీదుంది. కుదిరితే ఈసారే అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. కేసీఆర్‌ను అరెస్ట్ చేయించి, జైలుకు పంపించైనా సరే.. తెలంగాణలో తగ్గేదేలే అంటోంది. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో మాత్రం చతికిలపడుతోంది. ఆంధ్రాలో బీజేపీ నాయకత్వ లోపమే అందుకు కారణం. అధికార పార్టీతో అంటకాగడమే బీజేపీ వైఫల్యం. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలు బీజేపీని అంటరాని పార్టీగా చూస్తున్నాయి. ఇప్పుడే కాదు.. మొదటి నుంచీ కాషాయం పార్టీకి ఉత్తరాది పార్టీగానే పేరుంది. అది చెరిపేసుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నా.. పెద్దగా వర్కవుట్ కావడం లేదు. అందుకే, ఈసారి వెంకయ్య నాయుడు రూపంలో మరో పావు ముందుకు కదుపుతోంది బీజేపీ. అవును, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఈసారి రాష్ట్రపతిగా పదోన్నతి కల్పిస్తారనే టాక్ ఢిల్లీ వర్గాల్లో ఉంది. వెంకయ్య బీజేపీలో మేరుపర్వతం లాంటి నాయకుడు. పార్టీలో రాణించారు, ప్రభుత్వంలో మెప్పించారు, ఉప రాష్ట్రపతిగా మంచి పేరు సంపాదించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య అన్నివిధాలుగా బలమైన అభ్యర్థి అవుతారు. అప్పట్లో ఏపీలో టీడీపీకి చెక్ పెట్టేందుకే, వెంకయ్యను కేంద్రమంత్రి నుంచి వైస్ ప్రెసిడెంట్‌కు షిఫ్ట్ చేశారని అన్నారు. ఈసారి కూడా దక్షిణాదిని ఇంప్రెస్ చేసేందుకు మళ్లీ ఆ వెంకయ్యనే పావుగా వాడుకునే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వెంకయ్య నాయుడికి మంచి గుర్తింపు ఉంది. వెంకయ్యని తమ వాడిగా భావిస్తారు ఇక్కడి వారు. అందుకే, ఇంతటి ఇమేజ్ ఉన్న ఈ తెలుగువాడిని.. అందరివాడిని చేయాలని చూస్తోందట బీజేపీ. అయితే, ఇటీవల గులాంనబీ ఆజాద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కాంగ్రెస్‌కు, కశ్మీర్‌కు చెందిన ఆజాద్‌ను దేశ ప్రధమ పౌరుడిని చేస్తే.. కాషాయం పార్టీకి తిరుగులేని ఇమేజ్ వస్తుందని లెక్కేస్తోంది. అయితే, ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ పని ఖతం అయిపోయింది. కశ్మీర్‌లోనూ బీజేపీ స్ట్రాంగ్‌గా ఉంది. సో.. ఆజాద్ వల్ల పెద్దగా అదనపు ప్రయోజనం ఏమీ రాకపోవచ్చనే చర్చ పార్టీలో నడుస్తోంది. బీజేపీకి చాలాఏళ్లుగా సవాల్‌గా నిలుస్తున్న.. దక్షిణాదినే మెయిన్‌గా టార్గెట్ చేయాలని.. అందుకే, రాష్ట్రపతి అభ్యర్థిగా ఆజాద్ కంటే వెంకయ్య అయితే సో బెటర్ అవుతారని కసరత్తు చేస్తోంది. దక్షిణాది నుంచి పలుపేర్లు పరిశీలిస్తున్నా.. వారెవరూ వెంకయ్య స్థాయికి సరితూగటం లేదని తెలుస్తోంది. కర్ణాటకలో ఎలాగూ బీజేపీ అధికారంలో ఉండటం, మాజీ సీఎం యడ్యూరప్పపై అవినీతి ఆరోపణలు ఉండటంతో.. ఆయన రేసులో లేకుండా పోయారు. కేరళలో ఎలాగూ ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి.. మలయాళీకీ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇక మిగిలింది.. తెలుగోడు, లేదంటే తమిళుడు. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై పేరు ప్రస్తావనకు వచ్చినా.. ఆమెకు రాష్ట్రపతి స్థాయి అర్హత లేదనే టాక్. ఇక, ఇటు తెలుగు వాళ్లకు, అటు తమిళులకు ఇష్టుడైన వెంకయ్య నాయుడు ఒక్కరే దేశ అత్యున్నత పదవికి సరైన అభ్యర్థి అవుతారనేది పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. మోదీ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం. అదే నిజమైతే.. వెంకయ్యకే ఆ పదవి వరిస్తే.. తెలుగుజాతి కంతటికీ అది గర్వకారణం.. ఆంధ్రులకు దక్కిన అరుదైన గౌరవం..అవుతుంది.
http://www.teluguone.com/news/content/is-venkaiah-naidu-become-bjp-president-candidate-39-132990.html





