ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందా?
Publish Date:May 21, 2024
Advertisement
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవడం సంచలనంగా మారింది. ఇది కేవలం ప్రమాదమా? లేక కుట్ర కోణం దాగి ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో ఇరాన్ దేశం హమాస్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో సిరియాలో ఇరాన్ అత్యున్నత స్థాయి సైనిక జనరల్ ను ఇజ్రాయెల్ మట్టుబెట్టగా, ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్ పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఈ స్థాయిలో వైరం నడుస్తున్న దశలో... ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ గురించి తెలిసినవారికి ఇలాంటి ఘటనలు పెద్దగా ఆశ్చర్యం కలిగించవు. ఎందుకంటే ఇజ్రాయెల్ శత్రువు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అంతమొందించే శక్తి సామర్థ్యాలు మొసాద్ కు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం! గతంలో ఇజ్రాయెల్ శత్రువులు వివిధ ఘటనల్లో చనిపోయారు. వాళ్లలో ఇరాన్ కు చెందిన అణు పరిశోధకులు కూడా ఉన్నారు. కచ్చితంగా ఫలానా వాళ్లు చంపారనే ఎలాంటి ఆధారాలు లేని రీతిలో వాళ్లు కడతేరిపోయారు. ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడంలో మొసాద్ దిట్ట! ఇజ్రాయెల్ తో పెట్టుకున్నవాళ్లు చచ్చిపోయారు కానీ, అందులో మొసాద్ పాత్ర ఇప్పటివరకు ఎక్కడా నిరూపితం కాలేదు. ఇరాన్ లో కీలక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఇద్దరు శక్తిమంతమైన నేతలు ప్రమాదంలో మరణించడం వెనుక శత్రువుల ప్రమేయం ఉందా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఇరాన్ తో పాటు అనేక మంది శత్రు దేశాల సభ్యులను అంతమొందించిన చరిత్ర ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కు ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వైరానికి అనేక సంవత్సరాల చరిత్ర ఉంది. మధ్య ప్రాచ్యంలో అస్థిరతకు ఈ వైరం ఒక కారణంగా మారింది. ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఆర్థిక సహకారం అందిస్తోందని, యూదులపై ఉన్న వ్యతిరేకతతో తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా దాడులకు దిగుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని ‘షాడో వార్’గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పరస్పరం దాడులకు దిగినప్పటికీ ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. ఈ రెండు దేశాల మధ్య వైరంలో ఇదే చివరి అంకం మాత్రం కాదని కచ్చితంగా చెప్పవచ్చు. - ఎం.కె. ఫజల్
http://www.teluguone.com/news/content/is-there-a-conspiracy-angle-behind-the-iranian-presidents-helicopter-crash-39-176485.html