వంద గ్రాముల కందిపప్పు.. నాలుగు టమాటాలు.. నాలుగు ఆలుగడ్డలు.. వరద బాధితులకు జగన్ సాయం
Publish Date:Jul 19, 2022
Advertisement
ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజలకు, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వాలు ముంపు బాధితులకు తక్షణం నిత్యావసరాలు అందించి ఆదుకోవడం కనీస ధర్మం, బాధ్యత. కానీ జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. వరద బాధితులకు వంద గ్రాముల కందిపప్పు, నాలుగే నాలుగు టమాటాలు,ఆలూ ఇవ్వడం హాస్యాస్పదమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలి ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వరదలు తీవ్ర నష్టం కలిగించాయి గోదావరి పరీవాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరి పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వర్షాలు తెరిపివ్వగానే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టి పరిస్థితులు తెలుసుకున్నారు. ప్రజలను వెంటనే ఆదుకోవడానికి బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు.. ఒక్కోకుటుంబానికి 2 వేల రూపాయల నగదు తాగునీరు, రేషన్, పశుగ్రాసం అందించాలని అధికారులను ఆదేశించారు. లంక గ్రామాల్లో బాధితులకు అధికారులు చేసిన వరద సాయం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆవేదన కలిగిస్తుంది. జగన్ ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా ముంపునకు గురై సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన లంక గ్రామాల ప్రజలకు ప్రభుత్వం తరఫున వంద గ్రాముల కంది పప్పు.. నాలుగంటే నాలుగు టమాటాలు, నాలుగు ఉల్లిపాయలు, నాలుగు బంగాళాదుంపలు అందిస్తున్నారు. అసలీ లెక్కలేమిటో, ఎవరు చెప్పారో తెలీదు. కానీ ఖచ్చితంగా అంతే ఇస్తున్నారు. ఈ మాత్రం దానికే ఎంతో గొప్పగా బాధితులను ఆదుకుంటున్నామంటూ ప్రచారం చేయంచుకుంటున్న ప్రభుత్వం విమర్శల పాలౌతోంది. వరద బాధితులకు ఇదేనా సాయం అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇక వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్ర బాబు నాయుడు ట్విట్టర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు. అల్లూరి జిల్లా చింతూరు మండలం చట్టిలో గోదావరి వరద సాయంపై మీడియాలో వచ్చిన కథనంపై చంద్రబాబు ట్వీట్ చేశారు. నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు!.ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం....లెక్క చూసుకో జగన్ రెడ్డి... నాలుగంటే నాలుగే!. అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈనెల 21న కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలులో చంద్రబాబు పర్యటిస్తారు. 22వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంటలో వరద బాధితులను పరామర్శించ నున్నారు.
http://www.teluguone.com/news/content/is-it-enough-to-help-flood-victims-39-140116.html