ఒక్క రాజధాని.. రెండు కార్పొరేషన్లు!.. అదానీ కోసమేనా? జగన్ డీల్ ఏంటి?
Publish Date:Jan 6, 2022
Advertisement
అమరావతిపై సీఎం జగన్ పంతానికి పోయారు. మాట తప్పి.. మడమ తిప్పి.. రాజధానిని మూడు ముక్కలు చేశారు. నవ్యాంధ్ర నిర్మాతగా చంద్రబాబుకు పాపులారిటీ రాకుండా కుట్ర చేశారంటారు. అలా అలా రెండేళ్లు అమరావతితో ఓ ఆటాడుకున్నారు. రైతులు ఎంతగా ఉద్యమించినా.. ఉక్కుపాదాలతో అణిచేశారే కానీ.. వారి ఆక్రందన విన్నది లేదు.. వారి ఆవేదన తీర్చింది లేదు. అలాంటి జగమొండి జగన్.. ఇటీవల సడెన్‌గా మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారు. సీఆర్డీఏను పునరుద్దరించారు. అదేంటి.. జగన్ ఏంటి.. ఇలా అమరావతిని అలానే ఉంచడమేంటి అని అంతా అనుమానించారు. కానీ, అప్పుడు కారణం తెలియలేదు ఎవరికీ. ఇప్పుడిప్పుడే అమరావతితో పెద్ద స్కెచ్చే వేశారనే అనుమానం బలపడుతోంది. దానివెనుక 'అదానీ' ప్రయోజనం దాగుందని ప్రచారం జరుగుతోంది. అమరావతి రాజధాని గ్రామాలు ఎన్ని? 29. అంతేగా. మరి, రాజధాని గ్రామాలతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని అనుకుంటే.. అందులో ఎన్ని గ్రామాలు ఉండాలి? 29 గ్రామాలేగా. కానీ, కాదు. అక్కడే ఉందంటున్నారు అసలు కిటుకు. ప్రస్తుతం, ఏపీ ప్రభుత్వం 19 గ్రామాలను ఓ మున్సిపల్ కార్పొరేషన్‌గా.. మరికొన్ని గ్రామాలను మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌గా మారుస్తోంది. ఎందుకిలా చేస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు. సదుద్దేశమే అయితే 29 గ్రామాలను కలిపి ఒకే కార్పొరేషన్ చేయాలిగా? రెండు కార్పొరేషన్లుగా విడగొడుతున్నారంటే.. ఏదో దురుద్దేశం ఉండే ఉంటుందని.. జగన్ గురించి బాగా తెలిసిన అమరావతి రైతులు డౌట్ పడుతున్నారు. అందుకే, ప్రభుత్వ ప్రతిపాదిత కార్పొరేషన్‌ను వ్యతిరేకిస్తూ.. రాజధాని గ్రామాలు ఒక్కోటిగా ఎదురుతిరుగుతున్నాయి. అందుకే అక్కడి ప్రజలు అమరావతి కార్పొరేషన్ ప్రజాభిప్రాయసేకరణలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 29 గ్రామాలను కలిపి ఒకే కార్పొరేషన్ చేస్తే ఓకే అంటాం కానీ.. ఇలా విడగొట్టాలనే ప్రయత్నాలను మాత్రం గట్టిగా అడ్డుకుంటామని తేల్చి చెబుతున్నారు అమరావతి రైతులు. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు వెనుక జగన్ కుట్ర ఇదేనంటూ తాజాగా ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని గ్రామాల్లో.. ఆరు వేల ఎకరాలు అదానీ సంస్థకు తాకట్టు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. పోర్టుల నుంచి కేపిటల్ భూముల వైపు అదానీ కన్నుపడిందని.. అందుకు జగన్ సైతం ఎప్పటిలానే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని చెబుతున్నారు. ఇప్పటికే అదానీ గ్రూపుతో జగన్ ఓ అవగాహనకు వచ్చారని.. అందుకే హడావుడిగా మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారని… అమరావతి కార్పొరేషన్ అంటూ హడావుడి చేస్తున్నారని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ సైతం ఇలాంటి విమర్శలే చేశారు. జరుగుతున్న ప్రచారంలో నిజమే ఉండి ఉంటుందని.. జగన్ నైజం గురించి తెలిసిన వారంతా నమ్ముతున్నారు.
http://www.teluguone.com/news/content/is-any-deal-between-jagan-and-adani-on-amaravati-corporation-39-129726.html





