ఇరాన్ యుద్ధం.. చమురు సంక్షోభం!
Publish Date:Apr 25, 2026
Advertisement
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను తీవ్ర ఇంధన సంక్షోభంలోకి నెట్టాయి. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు గతంలో ఎన్నడూ ఎరుగని విధంగా ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ముడిచమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గం మూసుకుపోవడం లేదా ఆ జలసంధి ద్వారా రవాణా నిలిచిపోవడం ప్రపంచ దేశాలలో పెట్రో ధరల పెరుగుదలకు కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చమురు వ్యాపారంలో దాదాపు 20 శాతం వాటా కలిగిన హోర్ముజ్ జలసంధి ప్రస్తుతం డీ ఫాక్టో క్లోజర్ అంటే దాదాపు మూసివేత స్థితికి చేరుకుంది. దీంతో చమురు సరఫరా గొలుసు దెబ్బతింది. దాదాపు తెగిపోయినంత పనైంది. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడిచమురు ధర కేవలం నెల రోజుల్లోనే బ్యారెల్‌కు 32 డాలర్లకు పైగా పెరిగి, ఏకంగా 128 డాలర్ల మార్కును తాకింది. ఈ అసాధారణ పరిణామం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పెట్రోల్ ధర లీటరుకు సగటున 1.22 డాలర్లకు, డీజిల్ ధర 1.238 డాలర్లకు చేరింది. వివిధ దేశాల్లో ఇంధన ధరల పెరుగుదలను పరిశీలిస్తే.. అమెరికాలో గ్యాలన్ పెట్రోల్‌పై 1.11 డాలర్లు, డీజిల్‌పై 1.75 డాలర్ల భారం పడింది. యూరప్ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలలో ఇంధన ధరలు 17 నుండి 36 శాతం వరకూ పెరిగాయి. చైనా, జపాన్ వంటి ఆసియా దేశాలు ప్రభుత్వ నియంత్రణల ద్వారా ధరలను కొంత మేర అదుపు చేయగలిగినప్పటికీ, రిఫైనరీలపై పడుతున్న భారం ఆందోళన కలిగించే అంశంగా మారింది. అయితే, భారత ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, పన్నుల సర్దుబాటు వల్ల దేశీయంగా ధరలు స్థిరంగా ఉన్నాయనుకోండి అది వేరే సంగతి. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఈ చమురు సంక్షోభంలో పెట్రోల్ కంటే డీజిల్ ధరలే ఎక్కువగా పెరగడం ఆర్థిక నిపుణులను కలవరపెడుతోంది. డీజిల్ అనేది కేవలం వాహనాలకు మాత్రమే కాకుండా.. సరుకు రవాణా, లాజిస్టిక్స్, భారీ యంత్రాలకు ప్రాణవాయువు వంటిది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది మూలాధారం కావడంతో, డీజిల్ కొరత వల్ల నిత్యావసర వస్తువుల రవాణా భారమై ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది జీవన వ్యయ సంక్షోభంగా మారుతోంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన భద్రతపై ప్రతి దేశం పునరాలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఐఈఏ, ఈఐఏ వంటి అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగినంత కాలం ముడిచమురు మార్కెట్లో అస్థిరత కొనసాగుతూనే ఉంటుంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును రవాణా చేసినప్పటికీ, పెరిగిన బీమా ఖర్చులు, ప్రయాణ దూరం కారణంగా వినియోగదారుడికి ఇంధన భారం తగ్గకపోవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చివరగా, ఇరాన్ యుద్ధం కేవలం ఒక ప్రాంతీయ సమస్యగా మిగిలిపోకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే స్థాయికి చేరుకుంది. అభివృద్ధి చెందిన దేశాలు తమకున్న ఆర్థిక నిల్వలతో ఈ షాక్‌ను తట్టుకుంటున్నప్పటికీ, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన వర్ధమాన దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడిచమురు సరఫరా పునరుద్ధరణ జరగకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, సామాజిక స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఉంది. - సీతారాం కంఠంనేని
http://www.teluguone.com/news/content/iran-war-effect-36-218234.html





