ఒకే రోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చేసిన ఇరాన్
Publish Date:Apr 4, 2026
Advertisement
ఇరాన్ గగనతలంలో ఒకే రోజు అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు కూలిపోయిన ఘటనపై అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం తాము యుద్ధంలో ఉన్నామన్న ఆయన యుద్ధంలో యుద్ధ విమానాలకు నష్టం జరగడం అన్నది సర్వసాధారణమని పేర్కొన్నాడు. ఈ విమానాలు కూలిపోయిన సంఘటనలు శాంతి చర్చలకు ఎలాంటి ఆటంకం కాబోవని ట్రంప్ అన్నారు. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ.. ఇరాన్‌తో జరగాల్సిన దౌత్యపరమైన చర్చలకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. మధ్యప్రాచ్యంలో శుక్రవారం (ఏప్రిల్ 3) ఒకేరోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయడం అంతర్జాతీయం కలకలం రేపింది. ఇరాన్ యుద్ధ సామర్ధ్యంపై ప్రపంచ దేశాలు అబ్బురపడుతున్నాయి. అమెరికా అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయని అంటున్నాయి. ఇక పోతే ఇరాన్ దూకుడుతో అగ్రరాజ్యం డిఫెన్స్ లో పడింది. పదే పదే శాంతి చర్చల జపం చేస్తున్నది. ఇరాన్ నిర్ద్వంద్వంగా నో అంటున్నప్పటికీ బాబ్బాబు కాల్పుల విరమణ ఒప్పందానికి రండి అంటూ బతిమలాడుకుంటున్నట్లుగా అమెరికా తీరు ఉందని యుద్ధ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. తొలుత అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ అనే అత్యాధునిక యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. ఈ విమానంలో ని ఇద్దరు సిబ్బందిలో ఒకరిని సహాయక బృందాలు కాపాడాయి. రెండో పైలట్ కోసం గాలింపు జరుగుతోంది. అతడిని ప్రాణాలతో పట్టుకుని అప్పగిస్తే భారీ నజరానా ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే ఇరాన్ మరో అమెరికా యుద్ధ విమానాన్ని కూడా కూల్చివేసింది. అయితే అమెరికా మాత్రం రెండో యుద్ధ విమానం కూలిపోవడానికి సాంకేతిక లోపం కారణమంటున్నది. రెండో విమానం కూలిపోయిన ఘటనలో ఆ విమాన సిబ్బంది పరిస్థితి ఏమిటన్నది కూడా తెలియరాలేదు. కాగా ఒకే రోజు రెండు అమెరికా విమానాలను ఇరాన్ కూల్చివేయడంతో యుద్ధ తీవ్రత మరింత పెరిగినట్లైంది. ఈ విమానాల కూల్చివేతకు ప్రతిగా అమెరికా ఏ విధంగా ముందుకు సాగుతుంది, అమెరికా దుడులకు ఇరాన్ ఎలా బదులిస్తుందన్న విషయంపై సర్వత్రా ఉత్కంఘ నెలకొంది.
http://www.teluguone.com/news/content/iran-strikes-down-two-american-warflights-36-216651.html





