యుద్దం ముగింపునకు ఇరాన్ ఓకే.. కానీ..?
Publish Date:Apr 1, 2026
Advertisement
పశ్చిమాసియాలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకునేలా కనిపిస్తోంది. శాంతి చర్చలకు ఇప్పటికే అమెరికా మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ కూడా అదే తరహాలో స్పందించింది. ఇజ్రాయెల్-అమెరికాతో జరుగుతున్న యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే తమకు కొన్ని బలమైన హామీలు కావాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు. తాజాగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధం ముగింపు గురించి పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారని ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. యుద్ధం ముగించాలంటే తమకు కొన్ని బలమైన హామీలు కావాలని పెజెష్కియాన్ అన్నారట. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కావనే హామీ ఇస్తే, యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంటోనియో కోస్టాతో పెజెష్కియాన్ పేర్కొన్నారట. ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఆంటోనియో కోస్టా పశ్చిమాసియాలో పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలపై దాడులను ఇరాన్ ఆపాలని సూచించారు. దౌత్య మార్గాలతో సమస్యను పరిష్కరించుకోవాలని, హోర్ముజ్ జలసంధిని వీలైనంత త్వరగా తెరవాలని పేర్కొన్నారు. కాగా, అమెరికాతో తాము ఎలాంటి అధికారిక చర్చలూ జరపడం లేదని, ఆ దేశం ప్రతిపాదనలపై తాము ఇంకా స్పందించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/iran-ok-to-end-war-but-36-216519.html





