అడుగడుగునా అడ్డంకులు.. రైల్లోనూ వెంటాడిన నిఘా.. హైదరాబాద్ లోనే రైలు దిగేసిన రఘురామకృష్ణంరాజు
Publish Date:Jul 3, 2022

Advertisement
కోర్టులు ఆదేశించినా, ఏకంగా పీఎంవో నుంచే అవరోధాలు సృష్టించవద్దంటూ ఆదేశాలు వచ్చినా జగన్ సర్కార్ నర్సాపురం ఎంపీ రఘురామరాజును వదలడం లేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ భీమవరంలో జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాకుండా చేయాలని ‘ఔట్ ఆఫ్ ది వే’ ప్రయత్నాలను ఆపడం లేదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో సోమవారం అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరౌతున్నారు. ప్రొటో కాల్ ప్రకారం స్థానిక ఎంపీ ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అందుకు ఎంపి రఘురామకృష్ణం రాజు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి.. కోర్టు నుంచి కూడా లైన్ క్లియర్ చేసుకున్నారు. కోర్టు ఎంపీని అరెస్టు చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆయన భీమవరం వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను భీమవరం కార్యక్రమానికి హాజరు కాకుండా అడ్డుకోవాలనే నిర్ణయించింది. దీంతో కోర్టు తీర్పును లెక్క చేయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీని అరెస్టు చేయవద్దంటూ కోర్టు ఆదేశాలు వచ్చిన మరుసటి రోజునే భీమవరంలోని రఘురామకృష్ణంరాజు ఇంటి ముందు రోడ్డు ప్రభుత్వం ఆదేశాలతో తవ్వేశారు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కనిపించింది. ఎంపీ ని వేధించడానికే రోడ్డు తవ్వేశారన్న ప్రచారం జరిగింది. దానితో స్పందించిన రఘురామ కృష్ణంరాజు.. తవ్వేసిన రోడ్డు ఫోటోలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. దానితో స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం, వెంటనే దానిని సీఎంవో కు పంపటంతో రోడ్డును క్లియర్ చేశారు. దీన్నిబట్టి కోర్టు ఆదేశించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ రఘురామకృష్ణం రాజును మోడీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తోందని అవగతమౌతోంది. ఇలా ఉండగా ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు రాకుండా, ఓ కేంద్ర మంత్రి శతవిధాల ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజు సభకు వస్తే.. ప్రధాని కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని, ఫలితంగా భీమవరానికి చెడ్డ పేరు వస్తుందంటూ సదరు కేంద్ర మంత్రి, స్థానిక నేతలతో చెప్పినట్లు సమాచారం. వీటి వేటినీ లెక్క చేయకుండా భీమవరం వెళ్లడానికే నిర్ణయించుకున్న రఘురామ కృష్ణం రాజును నిఘా బృందాలు వెంటాడుతున్నాయి, వేటాడుతున్నాయి. నిఘా బృందాలు అనుసరిస్తున్నట్లు గుర్తించడంతో నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భీమవరం బయలుదేరిన రఘురామకృష్ణం రాజు బేగంపేట రైల్వే స్టేషన్ లోనే దిగిపోయి హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఆయనతో పాటు బయలు దేరిన ఆయన బృందం కూడా బేగంపేట రైల్వే స్టేషన్ లోనే దిగిపోయారు. అయితే అప్పటికే రఘురామ రాజును సమర్ధిస్తూ ఆయనకు అండగా నిలుస్తున్న కొందరు నేతలపై కేసులు పెట్టారు. అలాగే భీమవరంగా రఘురామకృష్ణం రాజుకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
http://www.teluguone.com/news/content/intelligence-follow-mp-raghu-rama-krishnam-raju-in-train-also-25-139003.html












