హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులు.!
Publish Date:Oct 1, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని జోన్లు, డివిజన్లు, పోలీస్స్టేషన్ల పరిధులను ప్రభుత్వం పునర్విభజించింది. మొత్తం 76 ప్రాంతాలకు సంబంధించి పరిధుల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను ఇతర జోన్లు, డివిజన్లకు బదిలీ చేశారు. ముఖ్యంగా మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోకి మార్చారు. శంషాబాద్, మహేశ్వరం, సైబరాబాద్ పరిధుల్లోనూ కీలక మార్పులు చేశారు. శంషాబాద్ డివిజన్లోని పోలీస్స్టేషన్ల పరిధులను సైతం పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పేరును శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్జీఐఏ, శంషాబాద్ పోలీస్స్టేషన్ల పరిధుల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.ఇక రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలను ఇతర పోలీస్స్టేషన్ల పరిధుల్లోకి మార్చారు. అబ్దుల్లాపూర్‌మెట్, మీర్పేట్ ప్రాంతాల్లోనూ పోలీస్ పరిధులను పునర్విభజించారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్‌నగర్ పరిధుల్లోనూ పోలీస్స్టేషన్ల సరిహద్దులను సవరించారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా పరిధులను మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణ పోలీస్స్టేషన్లకే పరిమితం కాకుండా ట్రాఫిక్ పోలీస్ విభాగంలోనూ జోన్లు, డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. మహిళల భద్రతకు సంబంధించిన వుమెన్ సేఫ్టీ వింగ్ పరిధిలోనూ కొత్తగా జోన్లను కేటాయించారు.అదేవిధంగా పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని జోనల్ సైబర్ సెల్ పరిధులను కూడా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. మొత్తంగా నగర పోలీస్ వ్యవస్థలోని వివిధ విభాగాలు, జోన్లు, డివిజన్లు, పోలీస్స్టేషన్ల పరిధుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం G.O.Ms.No.84 జారీ చేసింది. తాజా పునర్వ్యవస్థీకరణతో పోలీస్ పరిపాలనను మరింత సులభతరం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పోలీసింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు మార్గం సుగమం కానుంది. [ Hyderabad Police Commissionerate, .Shamshabad, Maheshwaram, Cyberabad, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/hyderabad-police-commissionerate-25-233162.html





