హైదరాబాద్ మెట్రో ఆగిపోతుందా..?
Publish Date:Feb 3, 2017
Advertisement
హైదరాబాద్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఛార్మినార్, ట్యాంక్‌బండ్, సైబర్ టవర్స్..వాటితో పాటే ట్రాఫిక్ కూడా. ఇరుకైన రోడ్లకి తోడు, అడుగడుగునా సిగ్నల్స్..ఆ చక్ర వ్యూహంలో మనిషి ఇరుక్కుంటే ఎప్పటికి బయటకొస్తాడో..అసలు వస్తాడో రాడో కూడా తెలియదు. పొద్దున్న ఆఫీసుకు వెళ్దామని బయలుదేరితే..ఆఫీసులు వదిలే సమయానికి కూడా ఇంకా ట్రాఫిక్‌లోనే ఉంటాడు. ఇలాంటి వాటికి చెల్లు చీటి చెప్పేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను తెరమీదకు తీసుకువచ్చింది. అయితే కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు తొలి నుంచి ఈ ప్రాజెక్ట్ వివాదాస్పదంగానే కొనసాగుతోంది. దాదాపు 72 కిలోమీటర్ల మేర ఆరు దశల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ కోసం నగర ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మెట్రో ఆగిపోతోందని...హైదరాబాద్ ప్రాధాన్యం నానాటికి తగ్గిపోతోందని..ఎల్ అండ్ టీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని..మొత్తం ప్రాజెక్ట్ నుంచే కంపెనీ వైదొలుగుతోందంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి.. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. అప్పటి నుంచి పనులు ఊపందుకున్నాయి..ట్రయల్ రన్‌లు విజయవంతమయ్యాయి...అంతా సాఫీగా సాగుతోంది అనుకుంటున్న దశలో ఇప్పుడు మరో ఉపద్రవం హెచ్‌ఎంఆర్‌ను చుట్టుముట్టింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో దాదాపు 900 ఎకరాల భూమికి సంబంధించిన యజమాని పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు..దీంతో అప్పటి ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనపరచుకుంది..ఆ భూమిలో దాదాపు 300 ఎకరాలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు విక్రయించింది. అది సుమారు 200 ఎకరాలను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేసి ఇళ్ల స్థలాల కింద విక్రయించింది. మరో 100 ఎకరాలను హైదరాబాద్ మెట్రో రైలు కోసం ఎల్ అండ్ టీ సంస్థకు కేటాయించింది. ఇందులో మెట్రో అధికారులు తమ అవసరాల కోసం అతిపెద్ద డిపోను నిర్మించుకున్నారు. ఇప్పుడు ఇదే మెట్రో ప్రాజెక్ట్‌కు అవరోధంగా మారింది. ఆస్తి అసలు యజమాని పాకిస్థాన్‌కు వెళ్లేముందు ఈ భూమిని తమకు విక్రయించారంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు చాలా ఏళ్ల కిందటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లోనే సుప్రీం దీనిని ప్రైవేట్ ఆస్తిగా నిర్థారించింది. ఈ మొత్తం ఆస్తిని తమ ఆధ్వర్యంలోనే విక్రయించాలని ఆదేశించి.. తమ ప్రతినిధిగా పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డిని నియమించింది. సుప్రీం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన నరసింహారెడ్డి భూమి హద్దులను నిర్ణయించాల్సిందిగా రెవెన్యూ శాఖకు ఓ లేఖ రాశారు. దీంతో తెలంగాణ రెవెన్యూ శాఖలో కలకలం రేగింది. ఎందుకంటే అప్పటికే సదరు భూమిని అనేక సంస్థలకు కేటాయించడంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు అధికారులు. ఇది ఇలా ఉంటే అదే భూమిలో ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైల్‌కు చెందిన మియాపూర్ డిపో ఉంది..ఈ డిపోను వినియోగించుకోవాలంటే దీనిని కొనుగోలు చేయాల్సి వుంటుంది. అసలే ఆర్థిక భారంతో సతమతమవుతున్న మెట్రో రైలుకు తాజా పరిణామం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైంది. ఈపాటికే పరుగులు తీయాల్సిన మెట్రో రైలు రూట్ మార్పుతో కొంత ఆలస్యమవ్వగా..సుప్రీం ఆదేశంతో మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో మెట్రో త్వరగా వస్తుందని ఎదురుచూస్తున్న సామాన్యుడికి మరికొంత కాలం ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు.
http://www.teluguone.com/news/content/hyderabad-metro-rail-corporation-45-71798.html





