ట్రంప్... అమెరికా వాళ్ల కేసీఆర్?
Publish Date:Feb 2, 2017
Advertisement
ట్రంప్ కు , కేసీఆర్ కు ఏంటి సంబంధం అంటారా? ఏ సంబంధమూ లేదు. కాని, వాళ్ల వ్యూహాలు మాత్రం చాలా దగ్గరగా వుంటాయి. అదే పెద్ద లింక్. ఇంతకీ విషయం ఏంటంటే... కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగదోయటానికి ఏం చెప్పేవారు? తెలంగాణని ఆంధ్రవాళ్లు దోచుకుంటున్నారని! ముఖ్యంగా, ఆంద్రా పాలకులపై ఆయన తోచినప్పుడల్లా ఒంటి కాలు మీద లేచేవారు. ట్రంప్ కూడా తన ప్రెసిడెన్షియల్ క్యాంపైన్ లో అదే రూల్ పాటించాడు. అమెరికా అంతటి అగ్రరాజ్యానికి కూడా ట్రంప్ అభద్రత నూరిపోశాడు. ఇండియన్స్ , చైనీస్, సింగపూర్ వాళ్లు, మెక్సికో జనాలు మన అవకాశాలు తన్నుకుపోతున్నారని ఒకటే ఉదరగొట్టాడు. కేసీఆర్ కూడా అచ్చం ఇలాగే చెలరేగిపోయే వారు తమ ఉద్యమ కాలంలో. అలాగే, ఆంధ్రుల పట్ల కేసీఆర్ విపరీత వాఖ్యలు చాలా సందర్భాల్లో పెద్ద రచ్చకి కారణం అయ్యేవి. డొనాల్డ్ ట్రంప్ ముస్లిమ్ ల మీదా , మెక్సికన్ల మీదా చేసిన కామెంట్స్ కూడా అలాగే వుంటాయి. అయిన దానికి, కాని దానికి అన్నిటికి ముస్లిమ్ లే కారణమంటాడు అమెరికా 45వ అధ్యక్షుడు! తెలంగాణ జనం తరుఫున మాట్లాడిన కేసీఆర్ అధికారం చేపట్టారు. ట్రంపు కూడా అమెరికన్ల గురించి మాట్లాడి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. కాని, కేసీఆర్ ఆంద్రా వాళ్లని వెళ్లగొట్టయే లేదు. హైద్రాబాద్ లో ఎవ్వరి మీదా దాడులు జరగలేదు. పై పెచ్చు ఆంధ్రా జనానికి కేసీఆరే ఇప్పుడు రక్షణగా వుంటానంటున్నారు! ట్రంపు కూడా స్వదేశంలోని ముస్లిమ్ లు భయపడవద్దనే చెబుతున్నాడు. కాని, విదేశాల నుంచి వచ్చే ముస్లిమ్ లకి మాత్రం చుక్కలు చూపించే ప్రయత్నం మొదలెట్టాడు. ఏడు దేశాల ముస్లిమ్ లని తొంభై రోజులు అగ్ర రాజ్యంలోకి రానిచ్చేది లేదని ఆర్డర్ వేశాడు. అంతే కాదు, అమెరికాలోకి ఎంటర్ అయ్యే మిగతా దేశాల మహ్మదీయులకి కూడా తీవ్రమైన చెకింగ్ లు తప్పకపోవచ్చు. పైగా ఇదంతా ట్రంప్ మార్కు దూకుడులో ట్రైలర్ మాత్రమే అంటున్నారు వైట్ హౌజ్ అధికారులు. ముందు ముందు ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పుకొస్తున్నారు.
కేసీఆర్ తెలంగాణ గురించి మాట్లాడింది, ట్రంప్ అమెరికా గురించి మాట్లాడింది అంతా తప్పా? అస్సలు కాదు. వాళ్ల వాదనలో నిజం వుంది. అందుకే, కోట్లాది మంది ప్రత్యక్ష ఎన్నికల్లో వారి వెంట నిలిచారు. కేసీఆర్ కు రాష్ట్రాన్ని, ట్రంప్ కు అమెరికాని అప్పజెప్పారు. కాని, చాలా మందికి కేసీఆర్, ట్రంపుల్లో హర్ట్ చేసే విషయం ఏంటంటే... వాళ్లు ఆరోపణలు చేసే విధానం! పరమ దారుణమైన భాషని ప్రయోగించి తమ ప్రత్యర్థుల్ని, శత్రువుల్ని దెబ్బతీస్తారు ఇద్దరు! అది వాళ్ల వాక్చాతుర్యం అని అభిమానులు అంటే... పొగరని మిగతా వారు అంటుంటారు!
ఒక్కసారి మనం కేసీఆర్ తెలంగాణ సెక్రటేరియట్ లోకి ఎంటరైన తొలి రోజులు గుర్తు చేసుకుంటే మనకు ఇలాంటి ట్రంపు మార్కు ఆర్డర్స్ చాలా గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా, సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఆయన పెద్ద కలకలమే రేపారు. అలాగే, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్ మెంట్ వివాదం కూడా చాలా రోజులు సాగింది. ఫలాన సంవత్సరం కంటే ముందు తెలంగాణకి వచ్చిన వారు అనర్హులు అంటూ కేసీఆర్ హుకం జారీ చేశారు. తరువాత ఆ సంగతి కోర్టు దాకా వెళ్లింది. ట్రంప్ ఆజ్ఞల్ని కూడా అమెరికన్ కోర్టులో ప్రశ్నిస్తున్నారు ఆయన వ్యతిరేకులు కొందరు!
ట్రంప్, కేసీఆర్ ల మధ్య పోలికల్లో మీడియాతో రిలేషన్ కూడా ఒకటి! ఆయనకీ, ఈయనకీ ఇద్దరికీ మీడియాలో పడలేదు పీఠం ఎక్కగానే. ఇప్పుడు కేసీఆర్ మీడియా సంబంధాలు ఒక కోలిక్కి వచ్చినట్టే కనిపిస్తున్నాయి. కాని, ట్రంప్ మాత్రం పబ్లిగ్గానే బెదిరిస్తున్నాడు పేపర్లు, ఛానల్స్ ని! జర్నలిస్టులకి సిగ్గేలేదంటూ విరుచుకుపడుతున్నాడు. తెలంగాణలో కేసీఆర్ రెండు ఛానల్స్ ని దాదాపు నిషేధించినంత పని చేసిన సంగతి అందరికీ తెలిసిందే!
ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారనీ, అధికారంలోకి వచ్చాక ఆయన తీరు మారిందని కొంత మంది విశ్లేషిస్తుంటారు. అందులో కొంత నిజం లేకపోలేదు. కాని, ట్రంప్ మాత్రం ఎన్నికల్లో గెలిచాక కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అయితే, ఇలా ఎంత కాలం ముస్లిమ్ సమాజాన్ని, మెక్సికన్లని, ఇండియా లాంటి దేశాల్నుంచి వచ్చిన వలస ఉద్యోగుల్ని, మరీ ముఖ్యంగా అమెరికాలోని తన వ్యతిరేకుల్ని తట్టుకుని నిలబడతాడో చూడాలి. పోను పోను తత్వం బోధపడితే ఆయన కూడా తన ట్రంపరితనం తగ్గించుకుంటాడని కొందరంటున్నారు!
http://www.teluguone.com/news/content/donald-trump-45-71752.html





