కేంద్రం వరమిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కరుణించదేమి
Publish Date:Jul 30, 2014
Advertisement
హైదరాబాద్ జంట నగరవాసులకు, ముఖ్యంగా శివారు ప్రాంతవాసులకు నీటి కష్టాలు కొత్తేమీ కాదు. ఇక వేసవి వస్తే ఆ కష్టాలు రెట్టింపు అవుతుంటాయి. నానాటికి జనాభా పెరిగిపోతుంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు? అని జనాలు భారంగా ఒక నిటూర్పు విడిచి సరిపెట్టుకోవచ్చును. కానీ నీటి సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు కేంద్రప్రభుత్వం ఆరునెలల క్రితం రూ.1050 కోట్ల నిధులను విడుదల చేసినప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అన్నీ ఉన్నప్పటికీ అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారయింది భాగ్యనగారవాసుల భాగ్యం. హైదరాబాదు శివారు ప్రాంతాలలో నీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్రం 2014 ఫిబ్రవరి నెలలో రూ.1050 కోట్లు మంజూరు చేసింది. దానిలో శేరిలింగంపల్లి సర్కిల్ కు రూ.439.51 కోట్లు, యల్.బీ.నగర్. సర్కిల్ కు 367.17 కోట్లు, రామచంద్రాపురం సర్కిల్ కు రూ.78.89 కోట్లు, పటాన్ చెరు సర్కిల్ కు రూ.58.19 కోట్లు మజూరు చేసింది. కొన్ని ప్రాంతాలలో పాత పైపుల స్థానంలో పెద్ద పైపుల ఏర్పాటు, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటు ఏర్పాటు, నీటి సరఫరా వ్యవస్థ మెరుగుదలకు అవసరమయిన ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం ఈ నిధులు మంజూరు చేసింది. అయితే నిధులు మంజూరు అయ్యి ఆరు నెలలు గడిచినప్పటికీ పనులు మొదలు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయలేదు. నాటి నుండి నేటి వరకు హైదరాబాదు మెట్రో వాటర్ బోర్డు అధికారులు ప్రభుత్వాల చుట్టూ తిరుతూనే ఉన్నారు. కానీ వారి గోడు వినే నాధుడే లేడు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం విడిపోయినట్లయితే నీటి కష్టాలు తప్పవని చాలా ధాటిగా వాదించేవారు. కానీ రూ.1050కోట్ల నిధులు మంజూరు అయినప్పటికీ పనులు మొదలు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేయకుండా అలసత్వం ప్రదర్శించి, భాగ్యనగర వాసులకు నీటి భాగ్యం లేకుండా చేసారు. ఆ తరువాత రాష్ట్ర విభజన, ఎన్నికలు వరుసగా వచ్చిపడటంతో ఆ ఫైళ్ళన్నీ దుమ్ముపట్టిపోయాయి. ఇప్పుడు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కూడా ప్రభుత్వం తమ వినతులను పట్టించుకోకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అధికారులు తలలు పట్టుకొన్నారు. తాము ఇప్పటికి రెండు సార్లు ప్రభుత్వానికి లేఖలు వ్రాశామని కానీ ఇంతవరకు జవాబు రాలేదని త్వరలో మళ్ళీ మరో మారు లేఖ వ్రాస్తామని అధికారులు చెపుతున్నారు. కేంద్రం నిధులు విడుదల చేసినప్పటి నుండి రెండు సంవత్సరాలలో వాటిని వినియోగించుకొని పనులు పూర్తి చేసుకోవలసి ఉంటుంది. లేకుంటే ఆ నిధులు వెనక్కు వెళ్లిపోతాయి. ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయని, ఇక మిగిలిన ఏడాదిన్నర కాలంలో ఈ పనులన్నీ పూర్తి చేసుకోలేకపోయినట్లయితే ఇక ప్రజలకు నీటి ఏడాది ఎన్నటికీ తప్పదని అధికారులు వాపోతున్నారు. కనీసం ఇప్పటికయినా తెలంగాణా ప్రభుత్వం పనులు మొదలు పెట్టేందుకు వాటర్ బోర్డుకు అనుమతులు మంజూరు చేస్తే నిధులు వెనక్కిమళ్ళి పోకుండా సద్వినియోగం అవుతాయి, ప్రజలకు నీటి కష్టాలు తప్పుతాయి.
http://www.teluguone.com/news/content/hyderabad-45-36675.html





