హుస్సేన్ సాగర్ ఇక ఖాళీ కాదు
Publish Date:May 27, 2015
Advertisement
హైదరాబాద్ నడిబొడ్డున వున్న కాలుష్య కాసారం హుస్సేన్ సాగర్ ఇక ఖాళీ కానట్టే. అసాధ్యమైన అంశాన్ని నెత్తికి ఎత్తుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హుస్సేన్ సాగర్ ద్వారా కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. హుస్సేన్ సాగర్ని ఖాళీ చేసి, ఆ చెరువును మంచినీటితో నింపాలనే ఆలోచనే ఆచరణలో అసాధ్యమైన ఆలోచన. ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతమాత్రం పట్టించుకోకుండా హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయించడం ప్రారంభించారు. రాజకీయ పార్టీలు ఎంత ప్రయత్నించినా కేసీఆర్ పట్టు సడలించకుండా హుస్సేన్ సాగర్‌లోని నీటిని బయటకి వదిలే పనిని కొనసాగించారు. అయితే కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారన్నట్టుగా హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘‘సేవ్ అవర్ అర్బన్ లేక్స్’’ అనే స్వచ్ఛంద సంస్థ పోరాటం చేసింది. హుస్సేన్ సాగర్ నీటిని వదలడం వల్ల ఆ నీరు ప్రవహించే నాలాల పరిసరాల్లో నివసించే ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం వుందని ఈ సంస్థ వాదించింది. చెన్నైలో వున్న పర్యావరణ కోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చి, హుస్సేన్ సాగర్ నీటిని విడుదల చేయకుండా ఆపించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా హుస్సేన్ సాగర్ నీటిని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. నాలాల మరమ్మతుల కోసం మాత్రమే నీటిని వదలాలి తప్ప ఖాళీ చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
సుప్రీం కోర్టు తీర్పుతో తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. ఈ వేసవిలో హుస్సేన్ సాగర్ని ఖాళీ చేసి తీరతామని స్పష్టంగా చెప్పిన సీఎం కేసీఆర్ మాట ఫలించకుండా పోయే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. హుస్సేన్ సాగర్లోకి కాలుష్య జలాలను తీసుకుని వస్తున్న నాలాలను దారి మళ్ళించే కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. దీనికోసం కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వచ్చిన సుప్రీం తీర్పు తెలంగాణ ప్రభుత్వం మీద నీళ్ళు జల్లింది. ప్రస్తుతం ఎండాకాలం ముగింపు దశలో వుంది. పదీ పదిహేను రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం వుంది. వర్షాలు కురవడం మొదలైందంటే హుస్సేన్ సాగర్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. అప్పుడు కోర్టు నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా వుండే ఆదేశాలు వచ్చినా ఉపయోగం వుండదు.
మొత్తమ్మీద పరిస్థితుల్ని, పరిణామాల్ని చూస్తే ఇక హుస్సేన్ సాగర్ ఖాళీ అవనట్టే భావించాలి.
http://www.teluguone.com/news/content/hussain-sagar-45-46778.html





