పార్లమెంట్ లో హాస్యోక్తులు!
Publish Date:Apr 6, 2025
.webp)
Advertisement
పార్లమెంట్ సమావేశాలంటే, ఏముంది? మూడు వాయిదాలు, ఆరు వాకౌట్లు. కాదంటే, గౌరవ సభ్యుల అరుపులు, కేకలు.. నిరసనలు, నినాదాలు, ఇంతే కదా అని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చును. తప్పు కాదని చెప్ప లేము.
అవును మరి సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని కదా అంటారు. సో.. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా అందరం చూస్తున్నది అదే అయినప్పుడు.. కళ్ళ ముందు కనిపిస్తున్న చిత్ర విచిత్ర, విన్యాస వికారాలను, కాదని అనడం కుదరదు. అందుకే, పార్లమెంట్ ను ఫిష్ మార్కెట్ అన్నా.. గౌరవ సభ్యుల ప్రవర్తనను సంఘ వ్యతిరేక శక్తులతో పోల్చినా.. సభ లోపల కన్ను గీటడం, కౌగిలింతలు, ముద్దులు మురిపాలు ప్రదర్శించడం వంటి చర్యలను పిల్ల చేష్టలుగా కొట్టి వేసినా తప్పు పట్టలేని పరిస్థితి పార్లమెంట్ ప్రతిష్ట దిగజారిందనే ఆవేదన ప్రజల్లోనే కాదు పార్లమెంట్ సభ్యుల్లో కూడా వ్యక్తమవుతోంది.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి పెద్దలు, పలు సందర్భాలలో పార్లమెంట్ పనితీరు పట్ల ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. నిజానికి గత కొంత కాలంగా, పార్లమెంట్ పని తీరు నానాటికి తీసికట్టు నాగం బొట్లు అన్నట్లు దిగాజరుతోందనే విషయంలో రెండో అభిప్రాయం లేదు. అయితే, శుక్రవారం ( ఏప్రిల్ 4)తో ముగిసిన, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ప్రారంభంలో ఎలా సాగినా, చివరి వారంలో వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభల్లో జరిగిన చర్చ సందర్భంగా కొంత భిన్నమైన, సంతోషకరమై వాతావరణం సభలో కన్పించిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్త మవుతోంది. అవును మన కళ్ళను మనం, మన చెవులను మనం నమ్మలేనట్లుగా ఉభయ సభల్లో చాలా లోతైన చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ తర్వాత ఉభయసభలు బిల్లును ఆమోదించాయి.
నిజమే చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు షరా మాములుగానే ఉన్నాయి. అయినా ఈ సారి సభ సమ్ థింగ్ స్పెషల్ ’ అన్న ఫీలింగ్ అయితే మిగిలింది. అలాగే పార్లమెంట్ ఉభయ సభల్లో ఇటీవల కాలంలో ఎప్పడూ లేని విధంగా, డేట్ మారే వరకూ, మారిన తర్వాత కూడా బిజినెస్ కొనసాగింది. వక్ఫ్ బిల్లుపై లోక్‌సభలో 14 గంటలపాటు చర్చ జరగ్గా. రాజ్యసభలో 17గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. రాజ్యసభ చరిత్రలోనే ఇదో అరుదైన విషయమని ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. రాజ్యసభలో చర్చ ప్రారంభమైన మరుసటి రోజు ఉదయం 4.02 గంటల వరకు కొనసాగింది. అయితే ఇలాంటి పరిస్థితి, ఇంతటి సుదీర్ఘ చర్చ జరిగిన సందర్భాలు లేవా అంటే, ఉన్నాయి.
చరిత్రలోకి వెళితే, 1981లో రాజ్యసభలో ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ బిల్లుపైనా ఉదయం 4.43 గంటల వరకు చర్చ కొనసాగినట్లు నివేదికలు చెబుతున్నాయి. లోక్‌సభలో స్టేట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ పై గతంలో 20.08 గంటల పాటు సాగిన చర్చే ఇప్పటివరకు సుదీర్ఘమైనది .ఆ తర్వాత 1993లో రైల్వే బడ్జెట్‌పై 18.35గంటల చర్చ జరిగింది. 1998లో రైల్వే బడ్జెట్‌పైనా 18.04 గంటలు, మైనార్టీల భద్రతకు సంబంధించి బిల్లుపై 17.25గంటలు, 1981లో ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ బిల్లుపై రాజ్యసభలో 16.58 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది.
ఇదంతా, ఒకెత్తు అయితే, చాలా రోజుల తర్వాత సభలో సరస సంభాషణలు, నవ్వులు కూడా వినిపించాయి. అది కూడా ఎప్పుడూ సీరియస్ గా ఉండే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సమాజ వాదీ పార్టీ ( ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు సరదాగా అంటించిన చురక సభలో నవ్వులు పూయించింది. అఖిలేష్ యాదవ్ తన ప్రసనంలో భాగంగా ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకునే, బీజేపీకి, పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవడం చేత కావడం లేదని ఒక వ్యంగ బాణం వేశారు. అందుకు సమాధానంగా అమిత్ షా, ఇతర పార్టీలలో అధ్యక్షుని ఎన్నిక అంటే, నలుగురైదుగురు కుటుంబ సభ్యులు కూర్చుని తమలో ఒకరిని అధ్యక్షుడు అనుకుంటే సరి పోతుంది. కానీ, బీజేపీ అధ్యక్షుని ఎన్నికలో 12 కోట్ల మంది సభ్యులకు భాగస్వామ్యం ఉంటుంది, సో, సహజంగా అధ్యక్షుని ఎన్నిక కొంత ఆలస్యం అవుతుందని, నవ్వుతూ సమాధానం ఇచ్చారు.అంతటితో ఆగకుండా, అఖిలేష్ యాదవ్ ను ఉద్దేశించి,మరో 25 సంవత్సరాలు, మీ పార్టీకి మీరే అధ్యక్షులుగా ఉంటారు అంటూ నవ్వేశారు. అమిత్ షా నవ్వుతో, అఖిలేష్ యాదవ్ సహా సభ్యులు నవ్వులు కలిపారు. అలాగే మంత్రి రామదాస్ అతవాలే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పై చురకలువేస్తూ చేసిన ప్రసంగం కూడా సభలో నిండుగా నవ్వుల పూయించింది. ఖర్గే సహా కాంగ్రెస్ అభ్యులను కూడా నవ్వించారు. ఇప్పడు ఈ రీల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నిజానికి, ఒకప్పడు పార్లమెంట్ లో హస్యోక్తులకు కొదవ ఉండేది కాదు. ఇప్పడు ఎప్పుడో ఇలా.. జన్మానికో శివరాత్రి..
http://www.teluguone.com/news/content/hunour-in-parliament-39-195691.html












