ఫుడ్ క్రేవింగ్ అంత ప్రమాదకరమా!
Publish Date:Nov 20, 2019
Advertisement
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్నాకా మధ్యాహ్నం లంచ్ తినేలోపు ఏదో ఒకటి తియ్యగా, కారంగా లేదా పుల్లగా తినాలనిపిస్తే ఖచ్చితంగా మీలో ఆందోళన లేదా వత్తిడి ఎక్కువగా ఉన్నాయనే అర్ధం అంటున్నారు మానసిక శాస్త్రజ్ఞులు. ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి లేకపోయినా ఏదో ఒకటి తినాలనుకోవటాన్నే క్రేవింగ్ అంటారట. ఆస్ట్రేలియా లో తాజాగా నిర్వహించిన ఒక సర్వే పురుషులకన్నా ఈ క్రేవింగ్ బారిన ఎక్కువగా పడినది స్త్రీలేలని తేల్చి చెప్పింది. ఇది కొందరిలో స్థిరంగా ఉంటే మరికొందరిలో మారుతూ ఉంటుందిట. ఒక నెలలో ఎక్కువగా తీపి పదార్థాలు తినాలని అనిపిస్తే మరో నెలలో పులుపు లేదా కారం ఉన్నవి ఎక్కువగా తినాలనిపిస్తుందిట. మానసిక స్థితిలోని మార్పులలాగానే ఆహారపదార్థాల మీదుండే కోరిక కూడా మారుతూ ఉంటుందిట. అంతేకాదు మానసిక ఆందోళనా,టెన్షన్స్,నిరుత్సాహం ఎక్కువగా ఉన్నవారి మెదడులో కొన్ని రసాయనాలు విడుదల అవుతూ ఉంటాయి. దానితో వారు అతిగా తినటం ద్వారా ఆ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళు ఎంత తింటున్నదీ,ఏం తింటున్నది అస్సలు పట్టించుకోరట. కేవలం డిప్రెషన్,టెన్షన్ మాత్రమే క్రేవింగ్ కి కారణం కాదు. రక్తంలో గ్లూకోస్ నిలవలు తగ్గిపోవటం, భోజనం చేసే వేళల మధ్య మరీ ఎక్కువ గ్యాప్ రావటం, హార్మోన్ల ఇంబాలన్స్ కూడా క్రేవింగ్ కి కారణాలు అవుతాయని చెపుతున్నారు వైద్యులు. అయితే ఇలాంటి ఇలా క్రేవింగ్ బారిన పడినవాళ్లు దానిని నియంత్రిన్చుకోవటం అంత పెద్ద పనేం కాదు. ఇది తగ్గుముఖం పట్టాలంటే ఒకేసారి ఎక్కువ మోతాదులో లంచ్,డిన్నర్లాంటివి తీసుకోకుండా ప్రతి మూడు గంటలకి ఒకసారి మితాహారాన్ని తీసుకోవటం వల్ల దీనిని నివారించవచ్చు. ఇలా మితాహారం కొంచెంకొంచెంగా తినటం వల్ల గ్లూకోజ్ పర్సెంటేజ్ నిలకడగా ఉంటుంది. క్రేవింగ్ బారిన పడినవారు పీచుపదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలిట. ఫాస్ట్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్,ప్యాకేజ్డ్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలిట. ఏదైనా తినాలని అనిపించినప్పుడు దాని మీద నుంచి ధ్యాస మారటానికి ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవటం అలవాటు చేసుకోవటం ఉత్తమం. ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే క్రేవింగ్ నుండి బయటపడటమే కాదు నాజుకుగా కూడా తయ్యారవుతారు. కళ్యాణి
http://www.teluguone.com/news/content/how-to-stop-food-cravings-34-55634.html





