ఘోర విషాదం.. సహారాలో దప్పికతో 50 మంది మృతి
Publish Date:Jun 5, 2026
Advertisement
దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకక దాదాపు 50 మంది మృత్యువాత పడిన ఘోర విషాద ఘటన ఇది. పశ్చిమాసియా దేశమైన సహారాలో ఈ విషాదం చోటు చేసుకుంది. నిర్జన సహారా ఎడారిలో ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు ఊహించని విధంగా సాంకేతిక లోపంతో మార్గమధ్యంలో మొరాయించింది. చుట్టూ ఇసుక తిన్నెలు తప్ప మరేమీ కనిపించని ఆ మార్గంలో తాగడానికి గుక్కెడు నీరు కూడా దొరకక అలమటిస్తూ ఏకంగా 50 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర నైజర్‌లోని అగడెజ్ ప్రాంత పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు, ఈ దుర్ఘటనలో మరణించిన బాధితులందరూ నైజర్ పౌరులు. వీరు మాలిలో వైభవంగా జరిగిన ఒక మతపరమైన ఉత్సవానికి హాజరై.. తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. అల్జీరియా, మాలి దేశాల అంతర్జాతీయ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండే అస్సమకా పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో వీరి ప్రయాణిస్తున్న ట్రక్కు అకస్మాత్తుగా ఆగిపోయింది. దారి పొడవునా ఎటువంటి మానవ సంచారం లేకపోవడం.. కమ్యూనికేషన్ దెబ్బతినడంతో ఆ ప్రయాణికులందరూ ఎడారి నడిబొడ్డున రోజుల తరబడి చిక్కుకుపోయారు. సహారా ఎడారిలోని కఠినమైన వాతావరణ పరిస్థితులు, విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేక ఒకరి తర్వాత ఒకరు కుప్పకూలిపోయారు. అయితే, ఈ మృత్యు కూపం నుండి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడగలిగారు. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి, ఆ భానుడి భగభగలకు తట్టుకుంటూ అస్సమకా పట్టణానికి చేరుకుని, అక్కడ ఉన్న స్థానిక అధికారులకు తాము ఎదుర్కొన్న నరకాన్ని, ట్రక్కు నిలిచిపోయిన విషయాన్ని వివరించారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన నైజర్ సహాయక బృందాలు, రెస్క్యూ సిబ్బంది వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది.
http://www.teluguone.com/news/content/horrific-tragedy-in-sahara-desert-36-222005.html





