ప్రభుత్వాస్పత్రుల్లో యమదూతలు ఎలుకలు, చీమలు
Publish Date:Jun 4, 2022
Advertisement
పెద్ద జంతువులు చిన్నజంతువుల్ని పలహారం చేసుకోవడం చాలా మామూలు. అది అటవీ న్యాయం. దాన్ని మానవ సమాజం అడ్డుకోలేదు, ఏమీ అనలేని స్థితి. ఇపుడు చిత్రంగా దేశంలో ఎలుకలు, చీమలు మనుషుల్ని చంపేస్తున్నాయి, చంపుకు తినేస్తున్నాయి! దీనికి మానవ సమాజం భయభ్రాంతులకు గురవుతోంది. వినడానికి మహా చిత్రంగా వుండవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఇలాంటి సంఘట నలు జరిగేయి. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే! చంటిపిల్లల్ని ఎలకలు, చీమలు పంచదారలా లాగించేయత్నాలు పెద్ద సంఖ్యలో జరగడం భయపెడుతుంది. ఇలాంటివి ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగడం మరీ వొణికించేస్తోంది. ప్రభుత్వాసుపత్రులు ఇప్పుడు అద్భుతం అని ప్రచారం చేసుకుం టున్న సదరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంఘటనలకు, అసలు ఆయా ఆస్పత్రుల స్థితికి కారణాలు తెలుసుకుని ఏ చర్యలు తీసుకున్నది లోకానికి తెలియాలి. ఎందుకంటే దేశంలో బీద బడుగు వర్గాల వారంతా ప్రభుత్వ ఆస్పత్రులను పాపం ఇంకా దేవాలయాలుగానే భావిస్తున్నారు. ప్రైవేటును ఆశ్రయించడానికి ఆర్థిక స్థోమత లేని బీదబడుగు వర్గాలకు అలా భావించడం తప్పని సరి అనివార్యత. డబ్బుపెట్టి పెద్దాస్ప త్రులకు వెళ్లలేం గదండీ.. అంటూ ప్రభుత్వాస్పత్రుల వంక ఎంతో గౌరవంతో చూసే వారికి వెన్నులో వొణుకుపుట్టిస్తున్నాయి అలాంటి సంఘటనలు. అది జార్ఖండ్ రాష్ట్రం గిరిధ్ జిల్లా ఆస్పత్రి.. మమతాదేవి అనే మహిళకు ఏప్రిల్ 2న పండంటి బిడ్డ పుట్టింది. రెండు రోజుల తర్వాత ఆ పాప పాదాల నుంచి మోకాళ్లదాకా ఎలుకలు కొరుక్కుతిన్నాయి. పుట్టగానే ఆ పసికందుకు శ్వాస సంబంధిత జబ్బుతో ఆస్పత్రిలో చేర్చారు. పాపకు జాండిస్‌వచ్చిందని ఆస్పత్రి లో చిన్నపిల్లల వార్డు డ్యూటీ డాక్టర్ అన్నారు. అంతవరకూ బాగానే వుంది. కానీ తర్వాత చికిత్స అందిస్తున్న క్రమంలో ఏకంగా ఇంక్యుబేటర్‌లో పెట్టిన పసికందుపై ఎలుకలు దాడిచేయడం మమతా దేవితో పాటు ఆ వార్త విన్న మనుషులందరికీ గొంతులోకి నీరు కూడా దిగలేదు. భయం, బాధతో ప్రభుత్వాస్పత్రుల మీద ఆగ్రహంతో రగిలిపోయారు. కానీ సదరు ఆస్పత్రి వర్గాలు మాత్రం డ్యూటీ డాక్టర్ , ఒక్కరిద్దరు నర్సులపై చర్యలు తీసుకోని చేతులు దులిపే సుకున్నారు. మరి మమతాదేవిని ఎవరు ఓదార్చాలి. ఇదేనా ప్రభుత్వాలు ఇచ్చే ఆరోగ్య, జీవన భరోసా?! ఇక కేంద్రం మహా అద్భుత పాలనగా గొప్పగా చెప్పుకుంటున్న యోగీ గారి యూపీకి వద్దాం. అక్కడా ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి నరకానికి నకలుగానే ఉంది. మహోబా జిల్లా ముధారికి చెందిన సీమా అనే మహిళ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రసవానికి చేరింది. మే 30న బిడ్డ పుట్టింది. శిశువు అనారోగ్యంగా వుండడంతో వైద్యులు నియోనటల్ ఇన్‌టెన్సివ్ కేర్ యూనిట్‌లో లో ఉంచారు. ఇన్‌టెన్సివ్ కేర్ యూనిట్ అంటేనే చాలా జాగ్రత్తలు తీసుకుంటారన్నది అందరికీ తెలిసిన సంగతి. కానీ ఈ ఆస్పత్రి లో అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్ధితి ఉంది. పరిశుభ్రత, పసికందులను జాగ్రత్తగా చూసుకో వడం అనే అంశాలకు అక్కడ బొత్తిగా స్థానం లేదు. ఇంత చెబుతున్నది ఎందుకంటే అక్కడ, ఆ యూనిట్‌లో వుంచిన శిశువును చీమలు కుట్టి చంపేశాయి. తల్లిదండ్రులు, జనం ప్రభుత్వ ఆస్పత్రుల తీరుతెన్నులను తిట్టిపోశారు. ఆ ఆస్పత్రి వర్గాలకు జీవించే హక్కే లేదన్నారు. వారి ఆక్రోశం నిజమే. కానీ సదరు రాష్ట్రప్రభుత్వం చేసిందేమిటి? తమకు ఎలాంటి చెడ్డపేరు రాకుండా వుండేందుకు ఇది కేవలం వైద్యుల నిర్లక్ష్యమే అని మామూలు ప్రకటన చేసేరు, ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ దర్యాప్తుకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సరే.. మరో ట్విస్ట్ ఏమంటే... శిశువుకు చికిత్స అందించడానికి వైద్యులు తమ దగ్గరి నుంచి రూ.6500 లంచం తీసుకున్నారని బాధితులు చెప్పడం. అంటే ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ తీసుకోవడానికి పాపం ఆ దంపతుల దగ్గర లంచం కొట్టేసి మరీ నిర్లక్ష్యంగా శిశువును వదిలే యడం. అసలు మనం మనుషులమేనా? మానవత్వం గురించి సినిమాలు, సీరియళ్లలో హీరో హీరోయి న్లతో, బయట నాయకులు ఉపన్యాసాలతో ఊదరగొట్టకుండా వాస్తవాల్ని కళ్లారా చూసో, తెలుసు కునో ప్రభుత్వాధికారులకు, ప్రభుత్వ ఆస్పత్రుల తీరుతెన్నులు మారేందుకు ప్రభుత్వాలు ఎనలేని కృషి నిజంగానే చేయాలి. కేవలం డాక్టర్లను అవసరాలమేరకు గౌరవించడం, సత్కరించడం కాకుండా నిజంగానే అక్కడి పరిస్థితులు ఇకనయినా చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు పూనుకోవాల్సిన సమయం ఇప్పటికే మించిపోయింది. తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాస్పత్రులలో కూడా పరిస్థితులు ఇంతే భయానకంగా ఉన్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోనూ, గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోనూ రోగులను ఎలుకలు కొరికేసిన సంఘటనలు జరిగాయి. ఏదో చేయాలన్నట్లు విచారణకు ఆదేశించడం, ఏదో ఒకరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులిపేసుకోవడంతో ప్రభుత్వాలు సరిపెట్టేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/horrible-conditions-in-government-hospitls-25-137024.html





