ఏపీలో డోర్ డెలివరీ తూచ్..!
Publish Date:Apr 22, 2020
Advertisement
ప్రజలు రోజు ఆర్డర్లు పెడుతున్నారు. కానీ సరుకులు రావడం లేదు. ఫోన్ చేస్తే సమాధానం చెప్పేవారు లేరు. వాట్సాప్‌లో ప్రశ్నిస్తే ఉలుకూ పలుకూ లేదు. దీంతో బయటకు వెళ్లి తెచ్చుకోవాలన్నప్పటికి కిరాణం దుకాణాలు తెరవడం లేదు. నిత్యావసర సరుకులు ప్రజలకు అందక ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. కనీసం గ్యాస్ సరాఫరా చేసే వాహానాలకు సైతం పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వడం లేదు. అనంతపురం పట్టణంలో సప్తగిరి కళాశాల వద్ద క్వారెంటైన్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడికి సమీపంలోనే గ్యాస్ గోదాము ఉంది. పోలీసులు అక్కడా ప్రత్యేక చెక్ పోస్టును ఏర్పాటు కంచెను వేయడంతో గ్యాస్ వాహానాలు సైతం తిరగడానికి వీలు లేకుండా పోయింది. నిత్యావసర సరుకులు లేక పోయినా... కనీసం గంజి నీళ్లు చేసుకోవడానికి అవసరమైన గ్యాస్ సరాఫరాను సైతం పోలీసు అధికారులు అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తామని, ప్రజలు ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావద్దని అధికారులు ప్రకటించారు. అవసరమయితే నిత్యావసర సరుకులు ఇంటికే అందిస్తామని చెప్పారు. కానీ దుకాణదారులు ఇంటికి వెళ్లి సరుకులు అందజేసేందుకు నిరాకరించారు. దీంతో ప్రజలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని ప్రాంతాల్లో ఉదయాన్నే స్థానిక దుకాణాల్లో సరుకులు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లితే పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. కనీసం ప్రధాన రహదారుల్లో ఉన్న నిత్యావసర సరుకుల దుకాణదారులు తమ షాపులను ఓపన్ చేస్తే అధికారులు కేసులు నమోదు చేస్తుండడంతో వారు సైతం తెరవడం లేదు. లాక్‌డౌన్ అమలులోకి వచ్చాక నిత్యావసరాల కొనుగోలు కోసం రోజూ ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకూ అనుమతి ఇచ్చారు. ఇంటికి ఒకరు మాత్రమే బయటకు రావాలని ఆంక్షలు విధించారు. అనంతపురం కలెక్టర్, జేసీ ప్రత్యేక కార్యచరణ చేపట్టారు. సూపర్ మార్కెట్, కిరాణ దుకాణదారుల యజమానులతో మాట్లాడి డోర్ డెలివరీకి ఒప్పించారు. పట్టణంలో 6 సుపర్ మార్కెట్, 45 హోల్‌సేల్ దుకాణదారులకు కలిపి 229 మందికి నిత్యావసర సరుకులు అందించాలని గుర్తింపు కార్డులు మున్సిపల్ శాఖ తరుపున సమావేశాన్ని ఏర్పాటు చేసుకోని అందించారు. వాట్సాప్‌లో ఆర్డర్ పంపిన 24 గంటల్లో సరుకులు ఇంటికి తెచ్చించేందుకు వారు ఒప్పుకున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో వాట్సాప్‌లో ఆర్డర్ తీసుకునేందుకు ముందుకు వచ్చిన దుకాణదారులు అమలు చేయడంలో చేతులెత్తేశారు. అధికారులు విడుదల చేసిన ఫోన్ నెంబర్లకు ఆర్డర్ పెట్టినా స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు.
http://www.teluguone.com/news/content/home-delivery-problems-in-andhra-pradesh-39-98108.html





