డిజిటల్ కరెన్సీ.. బ్లాక్ చైన్.. చంద్రబాబు
Publish Date:Feb 2, 2022
Advertisement
ఐదారేళ్ల క్రితం క్రిప్టో కరెన్సీ లో మదుపు చేయడం, కరెన్సీని కొనుగోలు చేయడం, డిజిటల్ కరెన్సీ గురించిన డిస్కషన్స్ అంటే అంతా ఓ కొత్తలోకంలా అనిపించింది. కనిపించని వ్యక్తితో, కనిపించని కరెన్సీలో మదుపు చేయడం ఏమాత్రం సురక్షితం కాదని, డిజిటల్ కరెన్సీలో అంతా మోసమే ఉంటుందని అంతా అనుకున్నారు. కొత్తలో వచ్చిన ఏజెంట్లను బ్రోకర్లుగా (మోసగాళ్లుగా, కేటుగాళ్లుగా) చూశారు. కానీ ఇప్పుడదే డిజిటల్ కరెన్సీ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. గుర్తించినట్టు ప్రకటన ఇవ్వకపోవచ్చు గానీ... బడ్జెట్ లో ఆ కరెన్సీ మీద 30 శాతం పన్ను విధిస్తూ... ఇక రానున్న రోజుల్లో డిజిటల్ కరెన్సీ ప్రభావం ఏ లెవల్లో ఉంటుందో చెప్పకనే చెప్పారు. అప్పుడెప్పుడో ఆర్బీఐ కూడా డిజిటల్ కరెన్సీ మీద బాగా స్టడీ చేసి, ప్రభుత్వం దీనిమీద అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తరువాత ముందుకెళ్లవచ్చంటూ పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. పెట్టుబడిదారులకు, మదుపరులకు అప్పుడే అర్థమైంది.. రానున్న కాలంలో డిజిటల్ కరెన్సీకి మంచి భవిష్యత్తు ఉంటుందని. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్న క్రమంలో నిర్మలా సీతారామన్ నోట బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే మాట బయటపడింది. డిజిటల్ కరెన్సీ లావాదేవీల కోసమే గాక బ్లాక్ చైన్ టెక్నాలజీని అనేక ఇతర ప్రభుత్వ వ్యవహారాల్లో ఇప్పటికే వాడుతున్నారు. దీంతో బ్లాక్ చైన్ టెక్నాలజీ మరోసారి డిస్కసివ్ పాయింట్ గా మారింది. అత్యంత భద్రమైన ఈ టెక్నాలజీని పాలనా వ్యవహారాలకు సంబంధించి దేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టినది ఆంధ్రప్రదేశ్ లోనే కావడం చెప్పుకోవాల్సిన అసలు విషయం. అయిదేళ్ళ క్రితం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో రాష్ట్రంలో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ని తొలిసారిగా రెవెన్యూ, రవాణా శాఖల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ దే భవిష్యత్ అంతా అని అప్పట్లో చంద్రబాబు చెప్పిన మాటల్ని ఇప్పుడు టెక్ పీపుల్ అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బ్లాక్ చెయిన్, బిగ్ డేటా అనలటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఎన్నో స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-గవర్నెన్స్ విధానానికి సైతం బ్లాక్ చైన్ టెక్నాలజీనే వాడారు. దేశవ్యాప్తంగా ఈ టెక్నాలజీ ప్రస్తుతం బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీ ఆధారంగానే డిజిటల్ రూపీ విధానం ప్రవేశపెడతామని నిర్మల ప్రకటించడం విశేషం. దీనివల్ల దేశంలో ఆర్థిక సంస్కరణలు కొత్తపుంతలు తొక్కనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2016లో రూపొందించిన ఐటీ విధానంలో భాగంగా దృష్టి పెట్టిన పది రంగాల్లో బ్లాక్ చైన్ కూడా ఒకటి. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా భూ రికార్డుల నిర్వహణ కత్తిమీద సాములాంటిదే. ఆ రికార్డులు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా నిర్వహించడం వల్ల పని ఎంతో సులువవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా భూ రికార్డుల ట్యాంపరింగ్ ను అరికట్టవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో హ్యాకర్ల దాడిని నిరోధించవచ్చు. నకిలీ ఓటర్లను పసిగట్టడం, ఎన్నికల నిర్వహణను సమర్థంగా నిర్వహించడం చేయవచ్చు. బ్యాంకుల నుంచి రైతులు సులభంగా రుణాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలను ఈ విధానంలో నమోదు చేస్తే, తర్వాత అదే విధమైన పరీక్ష మరోసారి చేసే అవసరం ఏర్పడదు. ఈ నెట్వర్క్ లోకి పాస్ వర్డ్ కలిగినవారు మాత్రమే ప్రవేశించే వీలుంది. మరొకరు గనక ప్రవేశిస్తే క్షణాల్లో ఆ సమాచారం మిగిలిన అందరికీ చేరిపోయి అప్రమత్తం చేస్తుంది. అందుకే దీన్ని అత్యంత భద్రమైందిగా భావిస్తున్నారు. ఇందులో ప్రతి లావాదేవీలో కూడా భాగస్వాములైన వారందరి వివరాలు ఒక్కో బ్లాక్‌గా ఏర్పడతా యి. ఒక బ్లాక్‌లో ఉన్నవారితో కొత్త లావాదేవీ జరిగితే, అది అంతకుముందే ఏర్పడిన బ్లాక్‌కు అనుబంధంగా మరో ప్రత్యేకమైన బ్లాక్‌గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్‌లన్నీ చైన్ మాదిరిగా రూపొందుతాయి. ఈ మొత్తం చైన్‌లో ఏ బ్లాక్‌లో, ఏ చిన్న మార్పు జరిగినా, ఆ లావాదేవీ జరిగిన బ్లాక్‌లో నమోదవుతుంది. ఇది సదరు నెట్‌వర్క్‌లో నిక్షిప్తం అవుతుంది. దీంతో ఏదైనా తేడా వస్తే ఆ చైన్‌లోని వారందరికీ తెలిసిపోతుంది. అంటే ఏ స్థాయిలోనూ ఏ వ్యక్తీ సొంతంగా, అనధికారికంగా, ఎలాంటి మార్పు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఇటీవలి కాలంలో బ్లాక్ చైన్ ఆధారిత కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా భూముల రిజిస్ట్రేషన్స్ లో ఈ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఎన్నికల సంఘం కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయడంతో పాటు ఎక్కడి నుంచైనా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా చేసే యోచనలో ఉంది.
http://www.teluguone.com/news/content/history-of-block-chain-introduced-by-chandrababu-39-131163.html





