హిండెన్‌బర్గ్ కథేంటి... అసలు ఏం జరిగింది?
Publish Date:Jan 16, 2025
.webp)
Advertisement
ఏ సంస్థ అయినా ఇక చాలు కావలసినంత సంపాదించేశాం అనుకుంటుందా? ఇంత సంపాదించేశాను, ఇక కంపెనీని మూసేస్థానని ఏ వ్యాపారవేత్తైనా చెబుతారా? అన్న ప్రశ్నకు అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ తాను అలాగే చెబుతాను, అదే చేస్తాను అంటున్నారు. ఆ కారణంగానే తాను హిండెన్‌బర్గ్ ను మూసేయాలని నిర్ణయించానని చెబుతున్నారు. అయితే హిండెన్‌బర్గ్ మూత ప్రకటన మార్కెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. నాథన్ అండర్సన్ మూసివేత ప్రకటనపై పరిశ్రమ వర్గాల స్పందన మిశ్రమంగా ఉంది. హిండెన్‌బర్గ్ మూతపడకపోతే మునిగిపోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ కంపెనీహిండెన్‌బర్గ్ పేరు వినగానే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చే పేరు అదానీ. హిండెన్‌బర్గ్ నివేదికల కారణంగా అదానీ సంస్థ భారీగా నష్టపోయింది. అదానీ గ్రూప్ మనీలాండరింగ్, సెక్యూరిటీ ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడిందంటూ 2023లో హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించింది. ఆ దెబ్బకు అదానీ మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ఆ ఏడాది అదానీ సంపద దాదాపు లక్ష కోట్లు ఆవిరైంది. ఆ తరువాత మళ్లీ కోలుకుందనుకోండి అది వేరే సంగతి. ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే హిండెన్‌బర్గ్ ఫేమస్ అయ్యింది మాత్రం అదానీ గ్రూపు అవకతవకలపై విడుదల చేసిన నివేదిక ద్వారానే.
అప్పట్లోనే హిండెన్‌బర్గ్ అదానీ గ్రూపు లక్ష్యంగా వెలువరించిన నివేదిక వెనుక ఏదో మతలబు ఉందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు ఉరుములేని పిడుగులా హిండెన్‌బర్గ్ మూసివేత ప్రకటన ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్లింగ్ వ్యూహాలతో లాభాలను ఆర్జిస్తుంది. అందులో బాగంగానే ఇప్పటి వరకూ అదానీ సహా 36 కంపెనీలపై తన రీసెర్చ్ డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఆ గ్రూప్ ప్రతికూల నివేదికలే విడుదల చేసింది. ఆ నివేదికల కారణంగా ఆయా కంపెనీల మార్కెట్ విలువ భారీగా పతనమయ్యాయి. సందట్లో సమేమియా అన్నట్లుగా హిండెన్‌బర్గ్ సంపాదన పెంచుకుంది.
అయితే షార్ట్ సెల్లర్లు ఎన్నడూ స్థిరమైన లాభాలను ఆర్జించలేరు. దీర్ఘ కాలంలో వాటికి రాబడి ఉండదు. అన్నిటికీ మించి ఇలాంటి షార్ట్ సెల్లింగ్ సంస్థలు గ్రే జోన్ లో పని చేస్తుంటాయి. ఒక కంపెనీని టార్గెట్ చేసుకుని పని చేస్తుంటాయి. అన్నిటికీ మించి వాటిపై నిఘా నియంత్రణ సంస్థల గురి ఉంటుంది. విచారణలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. తప్పుడు మార్గాల ద్వారా అసంబద్ధ నివేదికలు వెలువరించినట్లు రుజువైతే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే హిండెన్‌బర్గ్ మధ్యే మార్గంగా మూసివేత ఒప్పందానికి వచ్చి ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక అన్నిటికంటే ప్రధానంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనుండటమే హిండెన్‌బర్గ్ మూతకు కారణం. ఎందుకంటే అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు, అభియోగాలకు సంబంధించి పూర్తి వివరాలు, డాక్యుమెంట్లు సిద్ధం చేయాలని అధ్యక్ష పగ్గాలు చేపట్టకముందే ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే న్యాయశాఖ పని ప్రారంభించింది. దీంతో హిండెన్‌బర్గ్ తన నివేదికల హేతుబద్ధతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదా బోనులో నిలబడాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నాథన్ అండర్సన్ సంస్థ మూసివేత ప్రకటన పలు అనుమానాలకు తావిస్తోంది. షార్ట్ సెల్లింగ్ వ్యాపారంలో లాభార్జన కోసమే ఉద్దేశపూర్వకంగా కంపెనీల అవకతవకలపై నివేదికలు వెలువరిస్తుంటుందన్న ఆరోపణలు హిండెన్‌బర్గ్ పై ఉన్నాయి. ఒక్క అదానీ గ్రూపే కాకుండా హిండెన్‌బర్గ్ ఇప్పటి వరకూ దాదాపు 36 కంపెనీల్లో జరుగుతున్న మోసాలను బయట పెట్టింది. ఆ నివేదికల కారణంగా అయా కంపెనీల మార్కెట్ విలువలు భారీగా పతనమయ్యాయి.
ఇక మరో కథనం ఏమిటంటే హిండెన్‌బర్గ్ ఒక పావు మాత్రమేనని అదానీపై నివేదిక తరువాత భారత పార్లమెంటు వేదికగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఆదానీకి మద్దతుగా, వ్యతిరేకంగా మోహరించడమే ఇందుకు తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. హిండెన్‌బర్గ్ వెనుక ఒక కమ్యూనిస్ట్ నాయకుడి సతీమణి, జర్నలిస్ట్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా పేరున నడిచే ఒక స్వస్చంద సంస్థ, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వెబ్‌సైట్ ఉన్నాయనీ, వీటన్నింటికీ అజీమ్ ప్రేమ్‌జీ నడిపే స్వచ్చంద సంస్థ ఐపీఎస్ఎంఎఫ్ నిధులు సమకూరుస్తుందని ఆర్ఎస్ఎస్ అధికార పత్రికఆర్గనైజర్ కథనం పేర్కొంది. ఇన్ని రకాలుగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలపై అనుమానాలు ముప్పిరిగొన్న వేళ ఆ సంస్థ మూసివేత ప్రకటన సంచలనం సృష్టించింది. హిండెన్‌బర్గ్ మూసివేత ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే అదానీ పవర్ షేర్లు 9 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 7శాతం మేర పెరగడం కొసమెరుపు.
http://www.teluguone.com/news/content/hindenburg-closure-announcement-25-191366.html












