హైడ్రాపై హైకోర్టు ప్రశంసల వర్షం!
Publish Date:Aug 29, 2025
Advertisement
కోర్టుల నుంచి చీవాట్లు తినడమే పరిపాటి అన్నట్లుగా మారిన హైడ్రాకు తొలి సారిగా ప్రశంసలు లభించాయి. ఔను నిజమే తెలంగాణ హైకోర్టు హైడ్రాపై ప్రశంసల వర్షం కురిపించింది. ఇంత కాలం కోర్టులంటే లెక్కలేదా? మా ఆదేశాలను ఖాతరు చేయరా? కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారంటూ హెచ్చరికలు, మొట్టికాయలతో తలబొప్పి కట్టేలా చీవాట్లు పెట్టిన హైకోర్టు తొలి సారిగా గురువారం (ఆగస్టు 28) హైడ్రాను ప్రశంసించింది. హైదరాబాద్ నగరంలో రోడ్లపై ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందంటూ పొగడ్తల వర్షం కురిపించింది. హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు హైడ్రా చేస్తున్న కృషిని అభినం దించింది. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో హైడ్రా సేవలు భేష్ అంటూ జస్టిస్ బి. విజయ్ సేన్‌రెడ్డి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసం పేర్కొంది. విషయమేంటంటే.. రాంనగర్ మణెమ్మ వీధిలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన వాణిజ్య భవనాన్ని స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు హైడ్రా తొలగించింది. దీంతో తన భవనాన్ని కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఆ వాణిజ్య సముదాయ నిర్మాణదారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం (ఆగస్టు 28) విచారించిన హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.
http://www.teluguone.com/news/content/high-court-praises-hydra-36-205213.html





