విడదల రజినిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం
Publish Date:Feb 5, 2025

Advertisement
తెలుగుదేశంలో వున్నప్పుడు చంద్రబాబు కీర్తన చేసిన సైబరాబాద్ మొక్క విడదల రజిని, ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ భజన చేశారు. ఎమ్మెల్యే పదవితోపాటు మంత్రి పదవి కూడా పొందారు. జగన్ మెప్పు పొందడం కోసం ఏ నోటితో అయితే చంద్రబాబుని కీర్తించారో.. అదే నోటితో చంద్రబాబుని అనరాని మాటలు అన్నారు. రాజకీయ ఊసరవెల్లి తనానికి నిఖార్సయిన నిదర్శనంగా తెలుగు ప్రజల దృష్టిలో నిలిచారు. ఈ సైబరాబాద్ మొక్క విడదల రజిని మొన్నటి వరకు మంత్రి పదవి వెలగబెట్టి, ఈ ఎన్నికలలో గుంటూరు వెస్ట్ స్థానం నుంచి పోటీ చేశారు. గుంటూరు వెస్ట్ ఓటర్లు ఈమె వేస్ట్ అని ఆమెను ఓడించడం ద్వారా విస్పష్టంగా చెప్పేశారు.
అయినా ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా పోటీ చేసిన తొలి సారే ఎమ్మెల్యేగా ఎన్నికై.. జగన్ కేబినెట్ లో మంత్రిపదవి కొట్టేసిన విడదల రజనికి రాజకీయంగా రంగులు మార్చడం ఎలాగో బాగానే వంటపట్టింది. 2019 ఎన్నికలలో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విడదల రజనీ, 2024 ఎన్నికలు వచ్చేసరికి చిలకలూరి పేటలో చెల్లని కాసులా మారిపోయారని భావించిన జగన్ ఆమెను గుంటూరు వెస్ట్ కు మార్చారు. అయితే అక్కడ ఆమెను జనం ఓడించారు. ఇక మంత్రిగా ఆమె చేసిన అవినీతి, అక్రమ వసూళ్లపై, దౌర్జన్యాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓటమి తరువాత ఆమెకు అన్ని వైపుల నుంచీ చిక్కులు చుట్టుముట్టాయి. కొంత కాలం అజ్ణాతంలోకి వెళ్లిపోయినట్లుగా ఎవరికీ కనిపించకుండా, వినిపించకుండా గడిపారు. మధ్యలో పార్టీ మారేందుకు కూడా విఫలయత్నం చేశారన్న వార్తలు వినవచ్చాయి. మొత్తం మీద వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచీ ఈ మాజీ మంత్రి ఎక్కువగా మౌనాన్నే ఆశ్రయించి ఎవరి దృష్టిలోనూ పడకుండా మనుగడ సాగిస్తున్నారు. అయితే చేసిన తప్పులు అంత తేలిగ్గా వదలవు కదా!
తాజాగా ఆమెపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మాజీ మంత్రి విడదల రజినీ, ఆమె పీఏలు దొడ్డా రామకృష్ణ, ఫణి సహా అప్పటి సీఐ సూర్యనారాయణపై కూడా కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. తెలుగుదేశం నాయకుడు పిల్లి కోటి పిటిషన్ పై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ పిల్లి కోటి పిటిషన్ ఏమిటంటే..
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకూ విడదల రజినీ, ఆమె పీఏలు, దొడ్డారామకృష్ణ, ఫణి, అప్పటి సీఐ సూర్యనారాయణ తనను హింసించారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలంటూ పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించారు. 2019లో చిలకలూరి పోలీస్ స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురి చేశారని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో దీనిపై ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యా తీసుకోలేదని పిల్లి పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విడదల రజిని, ఆమె పిఏలు, అప్పటి సీఐపై రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
http://www.teluguone.com/news/content/high-court-orders-file-case-on-former-minister-39-192433.html












