హిజాబ్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కర్నాటకలో 144 సెక్షన్..
Publish Date:Mar 15, 2022
Advertisement
దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం సృష్టించిన హిజాబ్ ఉదంతంపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని తెలిపింది. ఇస్లాంలో కూడా హిజాబ్ ధరించాలనే నిబంధన ఏదీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విద్యా సంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆదేశించింది. కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తుది తీర్పు ప్రకటించింది. గత నెలలో కర్ణాటకలో రాజుకున్న హిజాబ్ పలు ప్రాంతాలకు వ్యాపించింది. ముస్లిం విద్యార్థినిలు తలపై హిజాబ్ ధరించి కాలేజీకి హాజరుకావడాన్ని అడ్డుకుంది కాలేజ్ యాజమాన్యం. అయినా, వారు హిజాబ్ తొలగించేందుకు నిరాకరించడం.. అందుకు ప్రతీగా హిందూ స్టూడెంట్స్ కాషాయ కండువాలతో హాజరుకావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పలు జిల్లాల్లో హిజాబ్‌కు మద్దతుగా- వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. ఇదే సమయంలో హిజాబ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఉడుపి, కుందాపుర ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తొలుత ఏకసభ్య ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. 15 రోజుల పాటు వాదనలు జరిగాయి. సంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ఉన్నత న్యాయస్థానం.. తాజాగా, హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదంటూ తుది తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో మార్చి 19 వరకు 144 సెక్షన్ విధించారు. ఉడుపిలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది.
http://www.teluguone.com/news/content/high-court-judgment-on-hijab-case-39-133045.html





