బాసరకు పోటెత్తిన భక్తులు: జ్ణానసరస్వతి జన్మనక్షత్రం సందర్భంగా పెద్ద సంఖ్యలో అక్షరాభ్యాసాలు.!
Publish Date:Oct 16, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఈ పర్వదినం సందర్భంగా శుక్రవారం (అక్టోబర్ 16) ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. జ్ఞాన ప్రదాయిని అయిన అమ్మవారిని మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల విద్యాభివృద్ధి కలుగుతుందని, పిల్లలకు బుద్ధికుశలత లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తమ చిన్నారులతో కలిసి బాసర క్షేత్రానికి పోటెత్తారు. అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ప్రత్యేక తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా క్యూలైన్లలో తీవ్రమైన రద్దీ మధ్య నిరీక్షిస్తున్న భక్తులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేడి పాలు, బిస్కెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. కాగా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు బాసర ఆలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆ తల్లి ఆశీస్సులు లభించాలని అమ్మకారిని కోరుకున్నారు. [Heavy Rush Basara, Basara Moola Nakshatra, Basara Jnana Saraswathi Temple, Aksharabhyasam, Goddess Saraswati, Dasara Navaratri, Telugu One]
http://www.teluguone.com/news/content/heavy-rush-basara-24-234569.html




