ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు మాజీ పీఏ అరెస్టు.. నెక్స్ట్ ఎవరు?
Publish Date:Feb 17, 2025
Advertisement
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు పీఏను అరెస్టు చేశారు. హరీష్ రావు పిఏ వంశీకృష్ణను పోలీసులు శనివారం (ఫిబ్రవరి 15) అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మరి కొందరిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం ఈ కేసులో తొడుపునూరి సంతోష్ కుమార్, బండి పరశురాములు, వంశీ కృష్ణలను అరెస్టు చేశారు. వీరిలో వంశీ కృష్ణ గతంలో అప్పటి మంత్రి హరీష్ రావు పేషీలో పీఏగా పని చేశారు. వంశీకృష్ణ స్వస్థలం సిద్దిపేట కావడం గమనార్హం. నల్గొండ జిల్లా ఆరోగ్య శ్రీ మేనేజర్ గా కూడా పని చేశారు. కాగా పోలీసులు వంశీ కృష్ణను అరెస్టు చేయడంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు సహకరించిన పరుశురాములు, సంతోష్ కుమార్ లను కూడా అదుపులోనికి తీసుకుని కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు వారికి ఈ నెల 28 వరకూ రిమాండ్ విధించింది. దీంతో వారిని చంచలగూడ జైలుకు తరలించారు. ఈ కేసులో హరీష్ రావును కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎందుకంటే ఈ కేసులో హరీష్ రావు ఏ1గా ఉన్నారు. ఇప్పుడు ఆయన మాజీ పీఏను పోలీసులు అరెస్టు చేయడంతో ఇక హరీష్ రావును కూడా అరెస్టు చేసే దిశగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/harishrao-pa-arrested-in-phone-taping-case-39-192985.html





