క్షుద్ర పూజలు చేసినట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టండి : హరీశ్‌రావు
Publish Date:Aug 17, 2026
Advertisement
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను పూజలు చేసినట్లు ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని సవాల్ చేశారు. దేవుడు కనిపిస్తే భక్తితో దండం పెట్టుకోవడం తనకు మొదటి నుంచీ ఉన్న అలవాటని హరీశ్‌రావు తెలిపారు. దేవుడి పేరుతో కూడా చిల్లర రాజకీయాలు చేయడం రేవంత్‌రెడ్డికి మాత్రమే తెలిసిన విద్య అని విమర్శించారు. ఆధ్యాత్మిక భావనతో తమిళనాడులోని తిరుచ్చిలో శ్రీరంగనాథస్వామి ఆలయానికి వెళ్లానని చెప్పారు. అలాగే కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు శివమొగ్గ ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. దేవుడి దర్శనం కోసం తాను ఆలయాలకు వెళ్లడం కూడా ముఖ్యమంత్రికి తప్పుగా కనిపిస్తోందా అని ప్రశ్నించారు. తాను ఎయిర్‌పోర్టుకు వెళ్లిన సమయంలో ఇంటెలిజెన్స్, పోలీసు అధికారులు గుర్తించి ఫొటోలు తీశారని, అభిమానంతో కొందరు తనతో ఫొటోలు దిగారని హరీశ్‌రావు వివరించారు. అయితే, అక్కడ తాను ఏవో పూజలు చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను అలాంటి పూజలు చేసినట్లు రేవంత్‌రెడ్డి వద్ద ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని సవాల్ చేశారు. తనపై బురదజల్లి, వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ‘పూజల డ్రామా’ ఆడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే తన పేరు చెప్పి ఆరోపణలు చేయాలని హరీశ్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డి తన పేరు ప్రస్తావిస్తే వెంటనే లీగల్ నోటీసు పంపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. చట్టపరమైన చర్యలకు భయపడే రేవంత్‌రెడ్డి తన పేరు నేరుగా చెప్పకుండా పరోక్షంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. Harish Rao, Revanth Reddy, Telangana Politics, Harish Rao Challenge, Pooja Controversy, Temple Visit, Political Controversy, Telangana Congress, BRS, Harish Rao Comments, Revanth Reddy Comments, Legal Notice, Political Allegations
http://www.teluguone.com/news/content/harish-rao-36-229129.html





