తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.!
Publish Date:Jul 22, 2026
Advertisement
తిరుమల గిరులలో హనుమంతుడి విగ్రహం చోరీ అయ్యింది. నిత్యం లక్షల మంది భక్తుల దర్శించుకునే తిరుమల క్షేత్రంలో జరిగిన ఈ ఘోర అపచారంపై సర్వత్రా దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కోట్లాది మంది భక్తులు ఆరాధ్యదైవంగా పూజించే తిరుమల కొండకు వెళ్లే మార్గంలో ఆంజనేయ స్వామి విగ్రహం మాయమవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నిత్యం వేలాది మంది భక్తుల నమస్కారాలు, నిత్య ధూపదీప నైవేద్యాలు అందుకునే ఆలయంలోనే ఈ దొంగతనం జరగడం భక్తుల తిరుమలలో భద్రతా చర్యలలోని డొల్ల తనాన్ని బట్టబయలు చేసింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు రాయి వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహం చోరీ అవ్వడంపై భక్తులలో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. మంగళవారం(జులై 21) అర్ధరాత్రి దాటిన తరువాత ఈ చోరీ జరిగింది. వేకువజామున స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆలయంలో మూలవిరాట్ విగ్రహం కనిపించకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. కొండపైకి వెళ్లే భక్తులు నిత్యం 7వ మైలు రాయి వద్ద ఆగి స్వామివారిని దర్శించుకుని, ప్రయాణం సురక్షితంగా సాగాలని వేడుకోవడం ఆనవాయితీ. అటువంటి ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ అవ్వడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు, టీటీడీ భద్రతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లో అమర్చిన సిసిటివి కెమెరా ఫుటేజీలను పరిశీలించగా, అర్థరాత్రి సమయంలో కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు రికార్డయింది. అతడు ఆంజనేయ స్వామి చిన్న విగ్రహాన్ని కాషాయ గుడ్డలో చుట్టి, ఎవరికీ అనుమానం రాకుండా దాచిపెట్టుకుని అక్కడి నుండి పరుగులు తీస్తూ పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఘాట్ రోడ్డులోని చెక్ పోస్టులు, తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు పరిసర ప్రాంతాలలోని అన్ని సిసిటివి కెమెరాలను జల్లెడ పడుతున్నారు. కాషాయ దుస్తుల్లో వచ్చిఈ అపచారానికి ఒడిగట్టిన దొంగను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు. Hanuman idol theft, Anjaneya Swamy idol stolen, Tirumala ghat road incident, Tirumala 7th mile temple, Tirupati latest news, Tirumala police investigation
http://www.teluguone.com/news/content/hanuman-idol-theft-36-226754.html





