ఈ నాలుగు అలవాట్లు ఉండే చాలు.. ఎప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు!
Publish Date:Apr 10, 2026
Advertisement
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా, సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు, నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు.. ఇలా జీవితం ఎంత సాఫీగా గడుస్తోంది అనుకున్నా.. మనిషి లోపల మాత్రం మనసు తృప్తిగా, సంతోషంగా అనుభూతి చెందడం లేదు. చాలామందిలో ఈ గందరగోళం కనిపిస్తూ ఉంటుంది. ఏదో కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటారు. అయితే దీనికి రివర్స్ గా.. సంతోషంగా ఉండే వ్యక్తులు మాత్రం జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సులువుగా అధిగమించగలరు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోగలరు, వీరికి జీవితం అసలు కష్టంగా అనిపించదు. కానీ సంతోషంగా ఉండటం ఎలా.. మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండటం కేవలం నాలుగు అలవాట్ల వల్ల సాధ్యం అవుతుందని అంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. ఆ నాలుగు అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. జాగ్రత్తగా వినడం.. కొంతమంది తమ గురించి మాత్రమే పట్టించుకుంటారు, ఇతరులు చెప్పేది వినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మీరు మాట్లాడే దానికంటే ఎక్కువగా వినడం నేర్చుకోవాలి. ఇతరులు చెప్పేది శ్రద్దగా వినగలిగే వ్యక్తులు జీవితంలో ఎన్నో సమస్యలను క్లిష్టతరం కాకుండా, అసలు సమస్యలుగా మారకుండా ముందుగానే వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు. తద్వారా జీవితాన్ని డిస్టర్బ్ చేసేంత సమస్యలు ఏవీ వారికి ఉండవు. పాజిటివ్ మైండ్ సెట్.. సానుకూల భావాలు అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ తమ జీవితాలతో సంతోషంగా ఉంటారు, వారికి దొరికే ఏ కొద్ది సమయాన్ని అయినా సంతోషంగా గడపడానికి, ఆ సమయాన్ని మధురమైన జ్ఞాపకాలుగా మార్చుకోవడానికి, పదిలపరుచుకోవడానికి ఇష్టపడతారు. ఈ విషయాలు క్రమంగా వారిని సంతోషంగా ఉంచుతాయి. ఒత్తిడికి దూరంగా ఉండటం.. సంతోషంగా ఉండే వ్యక్తులకు ఒత్తిడి లేకుండా నిద్రపోవడం అలవాటుగా మారుతుంది. ఈ అలవాటు సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుంది. నిద్రపోయేటప్పుడల్లా అస్సలు ఏ చింతా లేకుండా, ఏ సమస్య గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నం చేయాలి. ఇది ఒత్తిడిని దూరంగా ఉంచుతుంది. తమ మీద తాము జాలి పడటం.. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తులు తమ మీద తాము జాలి పడటం అస్సలు పాటించరు. వారు ఏదో ఒకటి నేర్చుకుని, తప్పులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ తప్పులను తాము దాచిపెట్టడం లేదా తమ అసమర్థతను ఒప్పుకోకుండా ఇతరులతో గొడవ పడటం లాంటివి చేయరు. పైన చెప్పుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆ లక్షణాలు వ్యక్తులను సంతోషంగా ఉండటానికి ప్రేరేపిస్తాయి, సహాయపడతాయి కూడా. *రూపశ్రీ
http://www.teluguone.com/news/content/habits-you-need-to-stay-happy-35-217089.html





