గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఉన్న ఆ ఒక్క ఛాన్స్ మిస్..?
Publish Date:Aug 7, 2017
Advertisement
ప్రస్తుతం దేశం మొత్తం గుజరాత్ రాజ్యసభ ఎన్నికల గురించే చర్చ. పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తోన్న సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను ఎలాగైనా రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే గుజరాత్ నుంచి ఖాళీగా ఉన్న మూడు సీట్లు తమకే చెందాలని భావిస్తోన్న బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అహ్మద్‌పటేల్‌ను ఓడించేందుకు పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా అమిత్‌షా, స్మృతీ ఇరానీలకు తోడుగా మూడో అభ్యర్థిని పోటీకి పెట్టింది. గుజరాత్ అసెంబ్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ విప్ బల్వంత్ సింహ్ రాజ్‌పుత్‌ను అహ్మద్‌పటేల్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దింపింది. ఆయన గెలుపుకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే చర్యలను ప్రారంభించింది. ప్రలోభాలకు లోనయ్యారో లేక భయపడ్డారో కానీ ఇప్పటి వరకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా మరికొందరు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. మిగిలి ఉన్న 44 మంది శాసనసభ్యులను తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకకు పంపి రక్షించుకునే ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే ఉండటం..ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉండటంతో మిత్రపక్షాల వైపు చూస్తోంది కాంగ్రెస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు పెట్టుకోవడం..ఆ ఎన్నికల్లో ఎన్సీపీకి చెందిన ఇద్దరు గెలుపొందడంతో వారి మద్ధతు తనకే లభిస్తుందని ఆశించిన హస్తానికి ఊహించని షాక్ ఇచ్చింది ఎన్సీపీ. రాజ్యసభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్ధతు ఇచ్చే అంశంపై తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత ప్రపుల్ పటేల్ చెప్పడంతో కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడ్డారు. గత యూపీఏ కూటమిలో తమ పార్టీ లేదు..ప్రస్తుతం అలాంటి కూటమి కూడా కొనసాగడం లేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న మా పార్టీ మద్ధతు కోసం అందరూ రాయబారాలు నడుపుతున్నారని..కానీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో పార్టీ అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రపుల్ పటేల్ స్పష్టం చేశారు. అయితే ఎన్సీపీ కాంగ్రెస్‌కు మద్ధతు ఇవ్వకుండా బీజేపీ ఆ పార్టీని భయభ్రాంతుకు గురి చేసిందని..రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి న్యూట్రల్‌గా ఉన్న ఎన్సీపీ ఇప్పుడు ఉన్నపళంగా ఇలా మాట్లాడం పలు అనుమానాలకు తావిస్తోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదీ ఏమైనా ఎన్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు మద్ధతు ఇస్తుందని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
http://www.teluguone.com/news/content/gujarat-45-76879.html





