సక్సెస్ నిధి తాళాలు ఇవిగో....
Publish Date:May 17, 2024
Advertisement
ఎవరైనా తమ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనల్ని మనం కొంత మెరుగుపరచుకోవాల్సి వుంటుంది. ఒక పద్ధతిలో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. ‘కష్టపడటం’ ఒక్కటే కాదు.. ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించడం అవసరం. అందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన... సమాచార సేకరణ. కేవలం చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికే ‘సమాచారాన్నిసేకరించే’ అవసరం వుంటుంది అనుకోవటం పొరపాటు అంటున్నారు నిపుణులు. పత్రికలు, ఇంటర్నెట్ వంటివి ‘విశ్వవ్యాప్త సమాచారాన్ని’ మన ముందు వుంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్‌డేట్‌గా వుంటటం మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన అవకాశాలని మెరుగుపరిచే మొట్టమొదటి అంశం అట. మనల్ని మనం మెరుగుపరచుకోవటానికి పెద్ద అడ్డంకి మన ‘భయాలు’. కొత్త వ్యక్తులతో మాట్లాడటమన్నా, నలుగురిలో తిరగడమన్నా, కొత్తపని మొదలుపెట్టడమన్నా భయపడేవాళ్ళు వుంటారు. ఆ భయాలని వదిలించుకోవటం ఏమాత్రం ఇష్టంలేదన్నట్టు పట్టుకుంటారు. అయితే మనల్ని మనం గెలవలేనప్పుడు ప్రపంచాన్ని ఏం గెలవగలం చెప్పండి? అందుకే ముందు మీలోని ఒక భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టండి. నలుగురిలో తిరగటం భయమనుకోండి.. కష్టంగా అనిపించినా నలుగురిలో కలవటం మొదలుపెట్టాలి. కొన్ని రోజులపాటు ఇబ్బంది అనిపిస్తుంది. పారిపోవాలనిపిస్తుంది. అయినా వెనక్కి తగ్గక ప్రయత్నిస్తే ఒకరోజున అది అలవాటుగా మారిపోతుంది. ఒక భయాన్ని దాటగలిగినా చాలు- ఆ అనుభం, దాని నుంచి లభించిన ఆత్మవిశ్వాసం మిగిలిన భయాలని సులువుగా దాటేలా చేస్తాయి. మన మాటలు సూటిగా, స్పష్టంగా వుండాలి. అవి సూటిగా, స్పష్టంగా వుండాలంటే మన ఆలోచనలు కూడా స్పష్టంగా వుండాలి. మన ఆలోచనలు గజిబిజిగా వున్నప్పుడు సూటిగా మాట్లాడలేం. సూటిగా మాట్లాడని వ్యక్తుల మాటలకు సమాజంలో గౌరవం వుండదు. అందుకే మన పరిసరాలని శుభ్రం చేసుకున్నట్టు మన ఆలోచనలనీ క్లియర్‌గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే మన పనితీరు కూడా గజిబిజిగా కాకుండా ఒక పద్ధతిగా వుండాలి. అది మనల్ని రిలాక్స్‌గా వుంచుతుంది. అలాగే చూసేవారికీ మనపట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకం కుదురుతుంది. ఒత్తిడిని దూరంగా ఉంచగలిగితే చాలు... మన సామర్థ్యం రెండురెట్లు పెరుగుతుందట. అలా ఒత్తిడికి దూరంగా వుండాలంటే పనితీరు, సమయపాలన, పని విభజన వంటి వాటి పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడు మన సామర్థ్యాన్ని వందశాతం వినియోగించుకోగలుగుతాం. అలాగే ఏ సమయంలోనైనా ఆత్మవిశ్వాసంతో, చెరగని చిరునవ్వుతో కనిపించే వ్యక్తులని ఇష్టపడని వారుండరు. చుట్టూ మనల్ని ఇష్టపడేవారి సంఖ్య పెరిగినకొద్దీ మన జీవితం ఆనందంగా మారిపోతుంది. కాబట్టి మనల్ని మనం ‘సరికొత్తగా’ ఆవిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. దీనికోసం నిపుణులు చేసిన సూచనలని తెలుసుకున్నారుగా.. ఇక ప్రయత్నించడమే మిగిలి వుంది. .....రమ
‘అసాధ్యాలు’ అంటూ ప్రపంచం ముద్రవేసి వదిలేసిన వాటిని కూడా ఛాలెంజ్ చేసి సాధించినవారి కోసం వింటూంటాం. ఏంటి వాళ్ళ ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళ ధైర్యమల్లా వారి బలాలని వారు కరక్టుగా అంచనా వేయటమే. ఎప్పుడూ మన బలాలు, బలహీనతల గురించి సరైన అవగాహన కలిగి వుండాలన్నది నిపుణులు చేస్తున్న రెండో సూచన. ఓ పేపర్ పైన మన బలం, సామర్థ్యం వంటి వాటిని రాసిపెట్టుకోవాలి. అలాగే మన బలహీనతలు, భయాలు వంటి వాటిని ఇంకో కాగితం మీద రాసి పెట్టుకోవాలి. దగ్గరి వ్యక్తులకి ఈ రెండు కాగితాలనీ చూపించి వారి సూచనలు అడగండి. అప్పుడు బలాలు, బలహీనలతని సమీక్షించుకుని... ఏం చేయొచ్చో.. ఏం చేయగలమో నిర్ణయించుకోవడం సులువవుతుంది.
http://www.teluguone.com/news/content/great-tips-for-success-35-40961.html





