ఆర్భాటంగా ప్రారంభం..అంతలోనే మూత.. జనం సొమ్ముతో జగన్ సర్కార్ ఆట
Publish Date:Jun 2, 2022
Advertisement
ఆర్భాటంగా ప్రారంభించడం.. ఆ తరువాత మరచిపోవడం జగన్ సర్కార్ కు అనవాయితీగా మారిపోయింది. గతంలో జగన్ ఆర్బాటంగా ప్రారంభించిన ఫిష్ ఆంధ్రా స్టాల్ నెల తిరగకుండానే మూత పడింది. తాజా చేపలు దొరక్క జనం అనారోగ్యం పాలౌతున్నారని తెగ బాధపడిపోయిన జగన్ మటన్, ఫిష్ ఆంధ్రా స్టాల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి ఈ అమ్మకాలేంటని ఎందరు విమర్శించినా జగన్ పట్టించుకోలేదు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఫిష్ ఆంధ్రా స్టాల్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. స్వయంగా జగన్ ఈ స్టాల్ ను ప్రారంభించారు. ఈ స్టాల్ కోసం లక్షల రూపాయలు వ్యయం చేసి అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. అయితే పులివెందుల నియోజకవర్గంలో ఈ స్టాల్ ఏర్పాటు సందర్భంగా చేసిన హడావుడి ఇంకా సద్దుమణగలేదు. నెల తిరక్కుండానే ఈ స్టాల్ మూతపడింది. నెల రోజులు నడిచిన ఈ స్టాల్ కు వచ్చిన విద్యుత్ బిల్లు మూడున్నర లక్షలు. అయితే నెల రోజుల అమ్మకాలూ కలిపినా అందులో సగం కూడా లేవు. దీంతో స్టాల్ మూతపడింది. యంత్రాలు చెడిపోవడమే ఇందుకు కారణమని సర్కార్ నమ్మబలికినా జనం నమ్మలేదు. లక్షల వ్యయంతో జర్మనీ నుంచి తీసుకువచ్చిన యంత్రాలు చెడిపోవడమేమిటన్న విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఏపీలో వైఎస్సార్ పశువైద్య సంచార వాహనాల సేవలు కూడా ప్రారంభించిన పక్షం రోజులకే చాలా వరకూ ఈ వాహనాలు మూలన పడ్డాయి. జగన్ ఈ పశువైద్య సంచార వాహనాలను స్వయంగా జెండా ఊపి ప్రారంభించారు. ఒకటి చొప్పున మొత్తం 175 వాహనాలను ఒకే సారి ప్రారంభించారు. ముందు చెప్పిన విధంగా కాకుండా చాలీ చాలని వేతనాలిస్తున్నారంటే పశువైద్యులు, పారా మెడికల్ సిబ్బంది సమ్మె బాట పట్టడంతో ఈ వాహనాలు మూలన పడ్డాయి. వేతనాలడిగిన పాపానికి వైద్యులు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో సమ్మె బాట పట్టిన పారా మెడికల్ సిబ్బంది తిరిగి విధుల్లోకి చేరినా వారు తమకు ప్రభుత్వం ఇచ్చే వేతనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం పశు వైద్య సంచార వాహనాలు మొత్తం మూడ పడటం ఖాయమని జోస్యం చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలోని సంచార పశువైద్య క్లినిక్‌లలో పని చేసే తమకు తక్కువ ఇవ్వడం సరికాదంటూ డాక్టర్లు సమ్మె చేపట్టారు. డాక్టర్లు, సిబ్బంది ఆందోళన చేపట్టడం ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ప్రశ్నించిన వారిపై చర్యలకు హుకుం జారీ చేశారని సమాచారం. ఈ కారణంగా సంస్థ 15 మంది డాక్టర్లకు ఉద్వాసన పలికింది. దీంతో పారా మెడికల్ సిబ్బంది తిరిగి విధుల్లో చేరుతున్నారు. కానీ డాక్టర్లు మాత్రం జీతాలు పెంచాల్సిందేనని పట్టు బడుతున్నారు. అంతే కాకుండా సంచార పశువైద్య సిబ్బందికి ఆర్బీకేల్లో పనులు అప్పజెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/grand-opening-closing-immediaely-jagan-government--wasting-people-money-25-136887.html





