మత్స్యకారులకు మంచి కబురు!
Publish Date:Jul 24, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు ఉరి తాడులా మారిన జీవో 217ను రద్దు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రకటించారు. శాసన సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ, గత ప్రభుత్వంలో మత్స్యకారులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో అచ్చెన్నాయుడు వివరించారు. జీవో 217 మత్సకారుల పాలిట మరణశాసనం అని చెప్పవచ్చు. ఇలాంటి దుర్మార్గమైన జీవోని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మత్స్యకారులు ఎంత వ్యతిరేకించినా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల మెడకు చుట్టుకున్న జీవో నంబర్ 217 అనే ఉరితాడు తొలగిపోయింది. ఈ జీవో ప్రకారం గ్రామాల్లో వంద ఎకరాలకు పైబడి వుండే చెరువుల్లో చేపలు పట్టుకునే అవకాశం స్థానికంగా వుండే మత్స్యకారులకు వుండదు. ఆన్‌లైన్‌లో వేలంపాటలో పాల్గొనడం ద్వారానే సదరు చెరువుల మీద హక్కు ఏర్పడుతుంది. సాధారణంగా గ్రామాల్లో మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో చెరువుల్లో చేపల వేట జరుగుతూ వుంటుంది. ఆ సంప్రదాయానికి 217 జీవో బ్రేక్ వేస్తుంది. బయటివాళ్ళు చెరువుల మీద ఆధిపత్యం చేసే అవకాశం ఇస్తుంది. ఈ జీవో రాష్ట్రంలోని 7 వందలకు పైగా వున్న మత్స్యకార సహకార సంఘాలకు, వాటి మీద ఆధారపడి వున్న 4 లక్షల మంది మత్స్యకారులకు గొడ్డలిపెట్టు లాంటిది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల మత్స్యకారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/good-news-to-fisher-men-25-181405.html





