రుషికొండ ప్యాలెస్ కు గ్లోబల్ టెండర్.!
Publish Date:Jul 3, 2026
Advertisement
విశాఖపట్నంలోని అత్యంత వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ విషయంలో ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో చారిత్రాత్మక రుషికొండకు బోడిగుండు కొట్టి, పర్యావరణ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ.. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న విషయంలో గత రెండేళ్లుగా మల్లగుల్లాలు పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రుల కమిటీ పలుమార్లు సమావేశమై, వివిధ ప్రత్యామ్నాయాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. ఈ ప్యాలెస్‌ను అంతర్జాతీయ స్థాయి సంస్థలకు లీజుకు ఇవ్వడమే ప్రభుత్వానికి లాభదాయకమని తుది నిర్ణయానికి వచ్చింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) రుషికొండ ప్యాలెస్ తో పాటు దానికి ఆనుకుని ఉన్న 9 ఎకరాల అదనపు భూమిని లీజు, ఆపరేషన్, మేనేజ్మెంట్, అభివృద్ధి కోసం అధికారికంగా అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ టెండర్ల దాఖలుకు ఈ నెల 10 తుది గడువుగా నిర్ణయించింది. రుషికొండ ప్యాలెస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లగ్జరీ రిసార్ట్ లేదా, ఫైవ్ స్టార్ హోటల్‌గా మార్చాలని ఏపీ టూరిజంభావిస్తోంది. గతంలో ఈ కొండపై ఉన్న టూరిజం రిసార్ట్స్ ద్వారా ఏడాదికి ఐదు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించేది. గత ప్రభుత్వం వాటిని తొలగించి ఈ భారీ ప్యాలెస్‌ను నిర్మించింది. అప్పటి నుంచి ఆదాయం లేకపోగా, ఈ ప్యాలెస్ మెయింటేనెన్స్ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే రుషికొండ ప్యాలెస్ ను పర్యాటక రంగంలో సరికొత్త గ్లోబల్ ఐకాన్‌గా తీర్చిదిద్దడం ద్వారా అటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతో పాటు, వైజాగ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ టెండర్ ప్రకటనతో గత కొద్ది రోజులుగా రుషికొండ భవనాల భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలికినట్లైంది.
http://www.teluguone.com/news/content/global-tender-for-rushikonda-palace-36-224941.html





