అమరావతికి చట్టబద్ధతపై గెజిట్.. చంద్రబాబు హర్షం
Publish Date:Apr 6, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించిన వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చారిత్రాత్మక పరిణామంపై స్పందించిన ముఖ్యమంత్రి, ఇది రాష్ట్ర ప్రజల విజయమని అభివర్ణించారు. ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కష్టకాలంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం సహకారంతోనే అమరావతి నిర్మాణ స్వప్నం ఇప్పుడు వాస్తవరూపం దాల్చబోతోందని ఆయన వివరించారు. ఈ బిల్లు ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించిన పార్లమెంట్ సభ్యులు, వివిధ రాజకీయ పక్షాల నేతలను ఆయన అభినందించారు. ముఖ్యంగా అమరావతి ఉద్యమంలో నిరంతరం పోరాటం చేసిన రైతులు, మహిళలను చంద్రబాబు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఏళ్ల తరబడి అనేక ఇబ్బందులను ఎదుర్కొని రాజధాని కోసం నిలబడిన ప్రతి పౌరుడి విజయం ఇది అని ఆయన కొనియాడారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి ఇక నుంచి ఒకే చిరునామా ఉండబోతోందని, అది అమరావతి మాత్రమేనని స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/gazette-issued-granting-statutory-status-25-216803.html





