నా స్థాయికి కార్పొరేషన్ చైర్మన్ పదవా నో.. గంటా నిరాసక్తత?
Publish Date:Jan 28, 2026
Advertisement
రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు పార్టీ నాయకులకు తెలుగు దేశం కూటమి ప్రభుత్వం పదవులను కేటాయిస్తున్నది. ఇలా దక్కిన పదవులను కొందరు అవకాశంగా భావిస్తుంటే.. కొందరు సీనియర్ నేతలు మాత్రం ఆ పదవులను నిరాకరిస్తున్నారు. అలా ప్రభుత్వం ఇచ్చిన పదవి వద్దంటున్న వారిలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒకరు. తాజాగా ఎకనామికల్ రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా క్యాబినెట్ హోదా ఉన్న పదవిని గంటా శ్రీనివాసరావుకు ఇవ్వాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పదవి పట్ల గంటా ఏ మాత్రం సంతోషంగా లేరని తెలుస్తోంది. వాస్తవానికి ఆయన చంద్రబాబు కేబినెట్ లో స్థానం కోసం పోటీ పడ్డారు. అయితే కూటమి సర్దుబాట్ల కారణంగా గంటాకు అవకాశం దక్కలేదు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా సామాజిక సమీకరణాలు, మహిళలకు ప్రాధాన్యత వంటి అంశాలతో వంగలపూడి అనితకు మంత్రి పదవి ఇచ్చారు. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు కి స్పీకర్ పదవి దక్కింది. పల్లా శ్రీనివాసరావుకు అధ్యక్ష పదవి దక్కింది. సామాజిక సమీకరణాలు, మహిళలకు ప్రాధా న్యత లక్ష్యంగా ఈ కేటాయింపులు జరిగాయి. అయితే గంటాకు మంత్రిపదవి దక్కకపోవడం పట్ల ఆయనతో పాటు ఆయన వర్గం కూడా ఒకింత అసంతృప్తితో ఉందని రాజకీయవర్గాలలో ఓ చ ర్చ అయితే జరుగుతోంది. ఇక గంటా తన ఆశలన్నీ మంత్రివర్గ విస్తరణపై పెట్టుకున్నారని అంటున్నారు. విస్తరణ జరిగితే తనకు కచ్చితంగా కేబినెట్ లో స్థానం దక్కుతుందని ఆయన భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు లేకపోవడంతో ఆశావహులకు కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇతర పదవులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ దశలో గంటా శ్రీనివాసరావుకు ఒక క్యాబినెట్ హోదాతో పదవి ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆ పదవి తీసుకోవడానికి గంటా శ్రీనివాసరావు సుముఖంగా లేరని అంటున్నారు. రాజకీయాల్లో దాదాపు 27 సంవత్సరాలుగా నిరాఘాటంగా చట్టసభల్లో కొనసాగుతున్న గంటా శ్రీనివాసరావు.. 1999లో అనకాపల్లి ఎంపీగా అరంగ్రేటం చేశారు. ఆ తరువాత ఆయన చోడవరం భీమిలి.. అనకాపల్లి, విశాఖ నార్త్... ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. అలాగే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ, ఆపై చంద్రబాబు నాయుడు హయాంలోనూ కూడా గంటా మంత్రిగా పని చేశారు.ఈ నేపథ్యంలోనే ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి తన కు తగదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా ఉండగా, గంటా శ్రీనివాసరావు తో పాటు ఇతరుల కు ఇచ్చే పదవులపై ప్రభుత్వం వ్యూహాత్మకంగా లీకులు వదిలినట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ లీకుల ద్వారా ఆయా నేతల మనోభావాలను గుర్తించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు విషయంలో చేసినట్లు చెబుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయిన తన స్థాయికి కార్పొరేషన్ చైర్మన్ పదవి సరికాదని గంటా భావిస్తున్నట్లు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/ganta-srinivasarao-express-displeasure-25-213102.html





