అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!
Publish Date:Dec 29, 2025
Advertisement
చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/friendly-atmosphere-in-the-assembly-25-211732.html





