మొగులయ్యకి ఫ్రీ బస్ పాస్.. శభాష్ సజ్జనార్...
Publish Date:Nov 25, 2021
Advertisement
మొగులయ్య తెలుసుగా. కిన్నెర వాయిద్య కారుడు. మంచి పాటగాడు. భీమ్లా నాయక్ సాంగ్ పాడిన కళాకారుడు. ఇన్నేళ్లూ ఆయనంత ఫేమస్ కాదు.. పవన్ కల్యాణ్ సినిమాకు పాట పాడటంతో ఓవర్ నైట్ ఆయన పాపులారిటీ అమాంతం పెరిగింది. ఇప్పుడు మొగులయ్యా ఎక్కడికి వెళ్లినా గుర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు. ప్రజలంతా ఆయనకు జేజేలు పలుకుతున్నారు. కిన్నెర వాయిద్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా, మొగులయ్య ఆర్టీసీపై ఓ పాట పాడారు. ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ.. సమాజంతో బస్సు పెనవేసుకున్న బంధాన్ని వర్ణిస్తూ.. అద్భుతంగా పాడారు. ఆర్టీసీ బస్సుపై మొగులయ్య పాడిని పాట సైతం బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. అందుకే, ఆర్టీసీ సేవలను కొనియాడుతూ.. తన పాటతో సంస్థకు మరింత గౌరవం తీసుకొచ్చిన మొగులయ్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సన్మానించారు. టీఎస్ఆర్టీసీ తరఫున ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించారు. ఆ విధంగా మొగులయ్యను గౌరవించారు సజ్జనార్. ఐపీఎస్‌గా పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక సంచలనాలు క్రియేట్ చేసిన సజ్జనార్.. ఆర్టీసీలోనూ అలానే దూసుకుపోతున్నారు. ఎండీగా వచ్చీరాగానే.. దసరా సీజన్లో ప్రత్యేక బస్సులతో ధరల బాదుడును తీసివేశారు. మామూలు టికెట్ రేట్స్ తోనే స్పెషల్ బస్సులు నడిపించి ప్రయాణీకుల ఆదరణ చూరగొన్నారు. బస్సు సర్వీసులను వేళకు వచ్చేలా చూడటం.. ఆక్యుపెన్సీ పెంచడం.. ఆకస్మిక తనిఖీలు చేయడం చేస్తూ ఆర్టీసీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల పెళ్లి వేడుకకు ఆర్టీసీ బస్ బుక్ చేసుకున్న దంపతులకు స్వయంగా బహుమతి అందజేసి.. ఆ జంటకు శుభాకాంక్షలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా, కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్యకి ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించి.. ఆర్టీసీ ప్రభుత్వానిది మాత్రమే కాదు.. మనందరిదీ అనిపించేలా వ్యవహరిస్తున్నారు. అందుకే సంస్థ సిబ్బంది శభాష్ సజ్జనార్ అంటూ కితాబిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/free-bus-pass-to-mogulaiah-39-127129.html





