యూరియా కోసం క్యూ లైన్‌లో మాజీ మంత్రి
Publish Date:Sep 14, 2025
Advertisement
తెలంగాణలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. నెలల తరబడి కేంద్రాల చుట్టూ తిరిగినప్పటికీ ఒక్క బస్తా కూడా దొరకడం లేదు. దీంతో యూరియా ఇస్తారనే సమాచారం తెలిసిన వెంటనే కేంద్రాలకు వెళ్లి అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కూడా యూరియా తిప్పలు తప్పలేదు. ఆమె కూడా యూరియా కోసం క్యూలైన్‌లో గంటల తరబడి వేచివున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో సత్యవతి రాథోడ్‌కు ఐదున్నర ఎకరాల భూమి ఉంది. దానికోసం యూరియా బస్తాల కోసం ఆమె గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్దకు ఆదివారం నాడు వచ్చారు. యూరియా బస్తాల కోసం క్యూలైన్‌లో నిల్చున్నారు. తీరా ఆమె లైన్ వచ్చేసరికి ఒక్క బస్తా మాత్రమే అధికారులు ఇచ్చారు. దీనిపై మంత్రి సత్యవతి రాథోడ్ అసహనం వ్యక్తం చేశారు. ఐదున్నర ఎకరాల భూమికి ఒక్క బస్తా మాత్రమే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. రైతులు నాట్లు వేసి నెల దాటినా ఒక యూరియ బస్తా కోసం వారాలు తరబడి క్యూ లైన్లో ఎదురు చూడటం సిగ్గు చేటని అన్నారు. పది ఎకరాలు, ఐదు ఎకరాలు భూమి ఉన్న రైతులకు ఒక యూరియ బస్తా ఇవ్వడం దుర్మార్గమని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడ యూరియ సరఫరా చేయాలని ప్రభుత్వన్ని ఆమె డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/former-minister-satyavati-rathod-36-206161.html





