జగన్ మావిగన్ సవాల్.. రగిలిపోతున్న ధర్మాన.!?
Publish Date:Jul 3, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ చాలెంజ్ ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలను డిఫెన్స్ లో పడేసింది. జనాలకు ముఖం ఎలా చూపించాలో తెలియనంతగా ఆత్మరక్షణలో పడ్డారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో ఒకప్పుడు తిరుగులేని నేతగా చక్రం తిప్పిన ధర్మానను జగన్ తీరు మరీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వైఎస్ హయాంలో ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాలలో కూడా చక్రం తిప్పిన ధర్మా ప్రసాదరావు జగన్ మావిగన్ చాలెంజ్ పై అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రభావమంతమైన నాయకుడు. ప్రజల్లో కూడా ఆయన పట్ల అభిమానం, గౌరవం ఉండేవి. తన వాగ్ధాటితో, విశ్లేషణలతో ప్రజా సమస్యలపై అసెంబ్లీలోనూ, బయటా గళం విప్పి ప్రజామన్ననలు అందుకున్నారు. అయితే అదంతా గతం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ధర్మాన ప్రభ రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. అందుకు కారణం.. జగన్మోహన్ రెడ్డి నాయకత్వ శైలిని, ఏకపక్ష పోకడలను ధర్మాన ప్రసాదరావు అంతర్గతంగా విభేదించడమేనని వైసీపీ వర్గాలే చెబుతుంటాయి. ఆ కారణంగానే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా ధర్మానకు అంత సీనియర్ అయి ఉండి కూడా తొలి మూడేళ్లలో మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కిందనుకోండి. అది వేరే సంగతి. విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. అయినా ధర్మాన ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను వదల లేదు. కానీ ఇప్పుడు జగన్ మావిగన్ అనడం ధర్మానకు మింగుడు పడటం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనతో ధర్మాన పూర్తి ఆత్మరక్షణలో పడిపోయారనీ, జగన్ తీరు కారణంగా తన సొంత ఇమేజ్ దెబ్బతింటోందని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారంటున్నారు. నాడు విశాఖ రాజధాని అంశంపై గట్టిగా నిలబడిన తాను ఇప్పుడు జగన్ మావిగన్ అనడంతో ప్రజలలో చులకన అయ్యాననీ బాధపడుతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ మావిగన్ నినాదంతో ధర్మాన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మావిగన్ ను బాహాటంగా వ్యతిరేకించాలన్న ఆగ్రహంతో ఆయన ఉన్నారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/former-minister-dharman-angry-on-mavigun-39-224969.html




