బెజవాడకు ముంపు తప్పదా? బుడమేరు ఇప్పటికీ దుఖదాయినేనా?
Publish Date:Aug 3, 2026
Advertisement
తెలుగువన్ స్పెషల్ విజయవాడ నగరాన్ని గతంలో తీవ్ర విషాదంలోకి నెట్టిన బుడమేరు ముంపు ఘటన జరిగి రెండేళ్లు పూర్తవుతోంది. ప్రభుత్వం అప్పట్లో ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంది. అండగా నిలిచింది. అంతే కాకుండా.. బుడమేరు ముంపు సమస్యను శాశ్వత పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటికీ నాటి బుడమేరు ముంపు ప్రాంతాల ప్రజలలో ఆందోళన ఇప్పటికీ ఇసుమంతైనా ఆందోళన తగ్గలేదు. వర్షాకాలం వచ్చిందంటే.. కృష్ణా నదికి వరద వస్తోందంటూ ఇక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరితే మళ్లీ ముంపు తప్పదా అన్న భయం మాత్రం స్థానికులను వెంటాడుతూనే ఉంది. గత వరదల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు కేవలం తాత్కాలికమేనని, ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. గతంలో వచ్చిన తీవ్ర వరదల వల్ల విజయవాడ నగరంలోని దాదాపు 16 డివిజన్లు నీట మునిగిన సంగతి తెలిసిందే. రాయనపాడు, సింగ్ నగర్, వైఎస్సార్ కాలనీ, రాజరాజేశ్వరిపేట, భవానీపురం వంటి అనేక ప్రాంతాల్లో ప్రజలు దాదాపు పది రోజుల పాటు వరద నీటిలోనే చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. బుడమేరు బెజవాడ పాలిట దుఃఖదాయినిగా మారింది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో బుడమేరులోకి వరద ప్రవాహం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.దీంతో బుడమేరుర ముంపు భయం వెంటాడుతోంది. ఈ సందర్భంగా.. గతంలో పడిన గండ్లను ప్రభుత్వం నామమాత్రంగానే పూడ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొండపల్లి శాంతినగర్ వద్ద ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం కూడా పూర్తిస్థాయిలో జరగలేదని సిపిఐ నేత శంకర్ అంటున్నారు. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 50 కోట్ల రూపాయలే మంజూరు చేయడంతో పనులు అరకొర మాత్రమే జరిగాయంటున్నారు. బుడమేరు దిగువ భాగంలో 282 ఎకరాలు, నగర పరిధిలో మరో 82 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు గతంలో నిర్వహించిన సర్వేలోనే తేలింది. బుడమేరు ప్రవాహ మార్గంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తొలగించకపోవడం, కాలువ లోతును పెంచకపోవడం వల్ల కొద్దిపాటి వరద వచ్చినా నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఏనికేపాడు అండర్ టన్నెల్ ఛానల్ వద్ద నీటి ప్రవాహ సామర్థ్యం కేవలం 4 వేల క్యూసెక్కులు మాత్రమే ఉండటం వల్ల, ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తే నీరు వెనక్కి తన్ని నగరంపైకి విరుచుకుపడే అవకాశం ఉంది. నాటి వరదల్లో ఆటోలు, గృహోపకరణాలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన బాధితులు ఇప్పటికీ కోలుకోని పరిస్థితి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆపరేషన్ బుడమేరు పేరుతో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నారు.కృష్ణా నది తరహాలోనే బుడమేరు పరివాహక ప్రాంతమంతా పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మించాలని, ఆక్రమణలను తొలగించి కాలువను వెడల్పు చేయాలని బెజవాడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. Vijayawada Floods, Budameru Flood Threat, Vijayawada News, Andhra Pradesh Rains, Budameru Retaining Wall
http://www.teluguone.com/news/content/flooding-inevitable-for-bezawada-36-227874.html





