బీజేపీలోకి ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు! త్వరలో మరో ఉప ఎన్నిక?
Publish Date:Nov 2, 2021
Advertisement
తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ పై ఆత్మగౌరవం గెలిచిందంటూ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. హుజురాబాద్ గెలుపు సంబరంలో ఉన్న దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ కథ ముగిసిందన్నారు. ఇకపై ఎప్పుడు ఎన్నికలు జరిగినా కమలం పార్దీదే విజయమన్నారు. ఓ టీవీ ఛానెల్ స్టూడియోలో మాట్లాడిన రఘునందన్ రావు మరో సంచలన కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు. త్వరలోనే వారంతా కార పార్టీకి రాజీనామా చేసి కాషాయ కండవా కప్పుకుంటారని చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు. తెలంగాణలో త్వరలోనే మరో ఉప ఎన్నిక రాబోతుందన్నారు రఘునందన్ రావు. సిరిసిల్ల జిల్లా వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పై త్వరలోనే అనర్హత వేటు పడనుందని తెలిపారు. వేములవాడకు జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీదే విజయమని చెప్పారు రఘునందన్ రావు. రఘునందన్ రావు కామెంట్లతో బీజేపీతో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ నేతలు ఎవరన్నదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఉత్తర తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఒక దక్షిణ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే అందులో ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు క్లారిటీగానే ఉంది. గతంలో తాను బీజేపీలో చేరబోతున్నాననే సంకేతం ఇచ్చిన నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతే త్వరలో కమలం గూటికి చేరతారని అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తన పదవికి రాజీనామా చేసే బీజేపీలో చేరతారని, అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం సాగుతోంది.
http://www.teluguone.com/news/content/five-trs-mlas-will-join-bjp-soon-25-125737.html





