తాడేపల్లి ప్యాలెస్ బయట మంటలు.. ఇది గులకరాయా? కోడి కత్తా
Publish Date:Feb 5, 2025
.webp)
Advertisement
మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద రోడ్డుకు ఆవలి పక్క స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. అయితే దీనిని వైసీపీ గోరంతలు కొండంతలుగా చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటి వద్ద మంటలు చెలరేగడంపై వైసీపీ చేస్తున్న అతి చూస్తుంటే అనుమానంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ నివాసం బయట రోడ్డు పక్కన బుధవారం సాయంత్రం రెండు సార్లు మంటలు వచ్చాయి. తీరా చూస్తే అది చాలా చిన్న అగ్ని ప్రమాదం. దీనికే బ్రహ్మాండం బద్దలైపోయినట్లు వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. జగన్ పై హత్యాయత్నం అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఈ స్వల్ప అగ్నిప్రమాదం కూడా జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ కు దూరంగా రోడ్డుకు ఆవలి పక్కన జరిగింది. ఈ స్వల్ప అగ్నిప్రమాదంపై జగన్ బ్యాచ్ చేస్తున్న హడావుడీ హంగామా చూస్తుంటే.. గతంలో జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి, గులకరాయి దాడులు గుర్తుకు వస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.
ఇలా ఉండగా అది ప్రమాద వశాత్తూ జరిగింది కాదనీ, జగన్ హయాంలో మద్యం స్కాంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సిట్ వేయగానే.. తాడేపల్లి పునాదులు ఎక్కడ కదిలిపోతాయోన్న భయంతో ఆ కుంభకోణానికి సంబంధించిన పత్రాలు, డైరీలను వైసీపీయులే తగలబెట్టేసి, అగ్ని ప్రమాదం, భద్రతా లోపం అంటూ కథలల్లుతున్నారని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి భూ దందాకు సంబంధించిన ఫైళ్లను దగ్ధం చేయడానికి ఏకంగా మదనపల్లి తహశీల్దార్ కార్యాలయంలోనే అగ్నిప్రమాదాన్ని సృష్టించిన ఘనత వైసీపీదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
నిజంగానే భద్రతా లోపం కారణంగా జరిగిన అగ్నిప్రమాదం అయితే బుధవారం సాయంత్రం మంటలు చెలరేగితే దాని సీసీ ఫుటేజీని ఇంత వరకూ ఎందుకు బయటపెట్టలేదని తెలుగుదేశం ప్రశ్నిస్తున్నది. తానే దాడులు చేయించుకుని తానే ఎదుటి వారిపై నిందలు వేయడం జగన్ కు అలవాటేనంటూ తెలుగుదేశం ట్వీట్ చేసింది. తానే తగులబెట్టి ప్రభుత్వంపై తోసేయడమేనా 2.0? అంటూ నిలవీసింది. ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది గెట్ రెడీ. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్' అని ఆ ట్వీట్ లో పేర్కొంది. తెలుగుదేశం, వైసీపీల విమర్శలు ఆరోపణలు అలా ఉంచితా.. అసలు అగ్ని ప్రమాదం జరిగిన తీరే చాలా అనుమానాస్పదంగా ఉంది. మంటలు వస్తున్నా జగన్ సెక్యూరిటీ సిబ్బంది వాటిని ఆర్పండంపై కాకుండా వీడియోలు తీయడంపైనే శ్రద్ధ చూపడం ఉద్దేశపూర్వకంగానే అక్కడ వేటినో తగులబెట్టారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అన్నిటికీ మించి అతి స్వల్పంగా వచ్చిన మంటలపై వైసీపీ ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం ఎందుకు చేస్తున్నదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అగ్ని ప్రమాదం మాటున, జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు, డైరీలు ధ్వంసం చేసినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ రెడ్డి హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై తెలుగుదేశం కూటమి సిట్ వేయగానే జగన్ ఇంటి ముందు స్వల్ప అగ్ని ప్రమాదం జరగడం.. ఆ ప్రదేశంలో కొన్ని కాగితాలు కాలి ఉండటంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.
జగన్ విదేశీ పర్యటన ముగించుకుని, ఆ తరువాత బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుని చాలా రోజుల తరువాత తాపీగా తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం లిక్కర్ కుంభకోణంపై సీట్ ఏర్పాటు చేసిందని తెలియడంతోనే ప్యాలెస్ లో ఉన్న మద్యం కుంభకోణానికి సంబంధించి పత్రాలను బయటపడేసి తగులబెట్టించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకూ వీడియోలు తీయగల అధునాతన సీసీటీవీ లు ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజీలను బయటపెడితే జగన్ తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్నిప్రమాదం వివరాలన్నీ బయటకు వస్తాయి. అయితే ఆ పని చేయకుండా జగన్ పై హత్యాయత్నం, ఇళ్లు తగలెట్లే యత్నం అంటూ వైసీపీ సోషల్ మీడియా ఊరూవాడా ఏకమయ్యేలా చేస్తున్న ప్రచారం చూస్తుంటే.. బాబాయ్ గొడ్డలి పోటు, కోడికత్తి దాడి, గులకరాయి దాడి సందర్భంగా వైసీపీ వ్యవహరించినట్లుగానే ఇక్కడా సానుభూతి ప్రోది చేసుకోవడానికి పడుతున్న తాపత్రయమే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సానుభూతికి తోడు.. మద్యం కుంభకోణం ఫైళ్లను కూడా దగ్ధం చేసేసి ఒకే దెబ్బకు రెండు లాభాలు పొందే అవకాశం కోసం అర్రులు చాచినట్లుగా కనిపిస్తోందంటేన్నారు. ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్ లోని సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/fire-near-jagan-tadepally-palace-39-192443.html












