ఢిల్లీలో ఫిన్ అలెన్ సిక్సర్ల జాతర.. కేకేఆర్ వరుసగా నాలుగో విజయం!
Publish Date:May 8, 2026
Advertisement
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శుక్రవారం (మే 8) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో కేకేఆర్ అలవోక విజయం సాధించింది. ముఖ్యంగా కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విధ్వంసకర సెంచరీతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాటర్లలో పాతుమ్ నిస్సంక అర్ధ సెంచరీతో రాణించగా, అశుతోష్ శర్మ 39 పరుగులు చేయడంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి, అనుకుల్ రాయ్ చెరో రెండు వికెట్లు తీసి ఢిల్లీని కట్టడి చేశారు. 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే, అంగ్‌క్రిష్ రఘువంశీ త్వరగానే ఔటయ్యారు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పారు. ముఖ్యంగా అలెన్ బౌండరీల కంటే సిక్సర్లకే ప్రాధాన్యత ఇస్తూ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 47 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు పూర్తి చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. అలెన్‌కు కామెరాన్ గ్రీన్ 33 పరుగులు.. సంయమనంతో ఆడుతూ సహకారం అందించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఢిల్లీ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్ వేసిన ఒకే ఓవర్‌లో అలెన్ మూడు సిక్సర్లు బాదాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో సిక్సర్‌తో అలెన్ తన సెంచరీని, జట్టు విజయాన్ని ఒకేసారి పూర్తి చేయడం విశేషం. దీంతో కేకేఆర్ మరో 34 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
http://www.teluguone.com/news/content/fin-allen-sixers-fest-in-delhi-36-219270.html





