పగటి కలలు కంటుంటారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
Publish Date:Apr 15, 2025
Advertisement
ఒక వ్యక్తి దైనందిన జీవితానికి, పనితీరుకు అంతరాయం కలిగించే అధిక పగటి కలలను మాలాడాప్టివ్ పగటి కలలు కనడం అంటారు. విశ్రాంతి తీసుకోవడానికి లేదా వాస్తవికత నుండి క్లుప్తంగా తప్పించుకోవడానికి ఆరోగ్యకరమైన మార్గంగా ఉండే సాధారణ పగటి కలల మాదిరిగా కాకుండా, మాలాడాప్టివ్ పగటి కలలు తీవ్రమైన, స్పష్టమైన, ఎక్కువగా లీనమయ్యే ఫాంటసీలను కలిగి ఉంటాయి, ఇందులో ఒక వ్యక్తి రోజులో గంటల తరగబడి ఈ పగటి కలలు కనడంలో సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. ఈ పగటి కలలు చాలా సంక్లిష్టమైన పరిస్థితులకు దారి తీస్తాయి. ఒక వ్యక్తి నిజ జీవిత పరిస్థితులు, బాధ్యతల కంటే తన ఫాంటసీ ప్రపంచాన్ని ఎక్కువగా ఇష్టపడే స్థాయికి ఇవి తీసుకువెళతాయి. పర్యావసానంగా ఊహాజనిత ప్రపంచంలోనే గడపడానికి ఇష్టపడతారు. అందులో తన పాత్రకే తను స్పందించడం, తను చాలా గొప్ప అని అనుకోవడం వంటివి చేస్తారు. సాధారణంగా విశ్రాంతి తీసుకున్నప్పుడో లేదా ఖాళీ సయమం ఉన్నప్పుడో ఎక్కువ మంది తమ భవిష్యత్తును ఊహించుకుంటూ ఉంటారు. భవిష్యత్తు కార్యాచరణలు, భవిష్యత్తులో సాధించబోయే విజయాలు, తాము చేరుకునే స్థాయి మొదలైనవి అన్నీ ఇందులో ఊహించుకుంటూ ఉంటారు. అయితే ఇది మనిషిని మానసిక రుగ్మతలోకి లాగేస్తుంది. పగటి కలలు కనేవారు సాధారణంగా మనుషులలో కలవడం కంటే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. సామాజికంగా చాలామందికి దూరమవుతారు. పగటి కలలలో కూడా మంచివి, చెడ్డవి రెండూ ఉంటాయి. మంచి చేసే విషయాలను ఊహించుకోవడం వల్ల సబ్కాన్షియస్ ను యాక్టీవ్ గా ఉంచుకోవచ్చు. కానీ చెడు విషయాలను పదే పదే పగటి కలలలో ఊహించుకోవడం వల్ల సబ్కాన్షియస్ మూలంగా జీవితంలో చెడు సంఘటలను చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఒత్తిడి, మానసిక ఆందోళన, మనసు గాయపడటం, నిరాశ, నిస్పృహ, అందరూ తనని ఒంటరిని చేసారనే భావన వంటి విషయాలను ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఇది మనిషి జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. కొంతమందికి అయితే పైన చెప్పుకున్న భావాల నుండి బయటపడి తాము సంతోషంగా ఉన్నాం అనిపించేలా చేయడానికి కూడా ఈ పగటి కలలు సహాయపడతాయి. ఎవరితోనూ ఎక్కువగా కలవని వ్యక్తులు పగటి కలలు కనడానికి అడిక్ట్ అవ్వవచ్చని వైద్యులు చెబుతున్నారు. వీటి ద్వారా తమ ఒంటరితనాన్ని జయించవచ్చు కానీ తాము జీవితంలో ఎప్పటికీ ఒంటరితనంలో ఉండిపోతారని అంటున్నారు. ఇలా.. పగటి కలలు జీవితంలో కొన్ని విషయాలలో సహాయపడినా.. చాలావరకు వ్యక్తి సమయాన్ని వృథా చేస్తాయి. అలాగే వ్యక్తిని వాస్తవిక ప్రపంచానికి దూరంగా లాక్కుపోవడం వల్ల వారి ఎదుగుదల మరీ అంత ఆశాజనకంగా ఉండదు. అందుకే పరిమితి లేని పగటి కలలు చాలా నష్టాన్ని చేకూరుస్తాయి.
పగటి కల చాలా తరచుగా ఉపయోగించే మాట. ఎవరైనా ఏ పనీ చేయకుండా ఆలోచనలో మునిగిపోయి లోలోపల సంతోష పడటాన్ని పగటి కల అని అంటుంటారు. అందులో భవిష్యత్తులో అలా ఉంటాం, ఇలా ఉంటాం, అలా జరుగుతాయి, ఇలా జరుగుతాయి అంటూ చాలా రకాలుగా ఊహించుకుంటూ ఉంటారు.ఇలా పగటి కలలు కనడం అనేది చాలామందికి ఒకానొక తృప్తిని ఇస్తుంది. కానీ ఈ పగటి కలల వల్ల కొంప కొల్లేరు అవుతుందని పరిశోధకులు అంటున్నారు.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/facts-about-daydreaming-35-196226.html





