నయా దందా: నగరంలో గడువు ముగిసిన మసాలాలకు కొత్త ముసుగు..!
Publish Date:Sep 23, 2026
Advertisement
ప్యాకెట్ చూస్తే కొత్తదే.. కానీ అందులోని సరుకు మాత్రం గడువు ముగిసినదే. లాభాల కోసం కొందరు వ్యాపారులు వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. గడువు ముగిసిన మసాలా ఉత్పత్తులపై కొత్త తేదీలు ముద్రించి.. వాటిని మళ్లీ మార్కెట్‌లోకి పంపేందుకు సిద్ధం చేసిన వ్యవహారం మేడ్చల్ జిల్లాలో వెలుగుచూసింది.పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో ఉన్న దిల్ బహార్ తయారీ యూనిట్‌పై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో సరైన తయారీ, గడువు తేదీ వివరాలు లేకుండా పలు మసాలా ఉత్పత్తులను ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఇప్పటికే గడువు ముగిసిన ప్యాకెట్లపై ఉన్న అసలు తేదీలను తెల్లటి స్టిక్కర్లతో కప్పి.. వాటిపై కొత్త తయారీ, గడువు తేదీలను ముద్రిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ప్యాకెట్లను తిరిగి సీల్ చేసి.. గడువు ముగియని ఉత్పత్తుల మాదిరిగా మార్కెట్‌లో విక్రయించేందుకు, పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తేల్చారు. దాడుల్లో మటన్ బిర్యానీ మసాలా, డ్రై మ్యాంగో పౌడర్, సబ్జీ మసాలా, చికెన్ మసాలా, మీట్ మసాలా, టీ పౌడర్‌తో పాటు పలు ఇతర మసాలా ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి యూనిట్ మేనేజర్ షేక్ జహంగీర్, యజమాని షేక్ మహ్మద్ నబీలను పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న సరుకుతో పాటు వారిని పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గడువు ముగిసిన ఉత్పత్తులకు కొత్త తేదీలు ముద్రించి విక్రయానికి సిద్ధం చేసిన వ్యవహారంలో మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. [ Expired Spices, Dil Bahar Unit, SOT Raid, Medchal News, Annojiguda, Expired Food Products, Food Safety, Spice Products,Poccharm IT Corridor Police, Food Adulteration, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/expired-spices-24-232287.html




