వేదాద్రి ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
Publish Date:Jun 18, 2020
Advertisement
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర భూభాగంలోనే ప్రమాదం జరిగినందున, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికి కూడా ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వేదాద్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. ఏపీకి చెందిన ముగ్గురితో పాటు మొత్తం 12 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి పువ్వాడ అజయ్ కు సీఎం కేసీఆర్ సూచించారు. కాగా, కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
http://www.teluguone.com/news/content/exgratia-to-vedadri-road-accident-victims-39-100377.html





