పవన్ ఆదేశాలకూ దిక్కులేదా?
Publish Date:Jun 9, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదా? సాధారణంగా ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్లు నత్తనడకన సాగుతాయని, మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తరచూ ఆరోపిస్తుంటారు. అధికారులు మంత్రుల మాటలను కూడా పెద్ద ఖాతరు చయరన్న విమర్శలూ వినవస్తుంటాయి. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. విషయమేంటంటే.. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పవన్ కళ్యాణ్ ఇటీవల రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఆ సందర్భంగా పుష్కర్ ఘాట్ నుంచి పడవలో ప్రయాణిస్తూ గోదావరి నది పరివాహక ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఎన్నో పారిశ్రామిక విభాగాలు, ఫ్యాక్టరీల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, నగరంలోని మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా గోదావరి నదిలోకి కలిసిపోతుండటాన్ని గమనించారు. కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే పుష్కరాల సమయానికి నది ఇంతలా కలుషితమైతే ప్రజల ఆరోగ్యం ఏమైపోతుందని ఆయన అధికారులను గట్టిగా నిలదీశారు. గోదావరిని కలుషితం చేస్తున్న పరిశ్రమలను తక్షణమే గుర్తించి, వాటికి నోటీసులు జారీ చేయాలని ఆయన స్థానిక అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. డిప్యూటీ సీఎం స్వయంగా ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ తాజాగా సోమవారం(జూన్ 8) నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్‌కు తాను ఆదేశాలు ఇచ్చి ఇన్ని రోజులైనా, కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సంస్థకు కూడా అధికారులు ప్రాథమిక నోటీసులు జారీ చేయలేదని తెలిసింది. దీంతో పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి సున్నితమైన, ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని సీనియర్ అధికారులపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ముఖ్యంగా గోదావరి నదిలోకి శుద్ధి చేయని రసాయన వ్యర్థాలను వదులుతోందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్ర పేపర్ మిల్స్ కు తక్షణమే నోటీసులు జారీ చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో పాటు, ఈ వ్యవహారంలో పర్యవేక్షణ లోపించి, బాధ్యతారహితంగా వ్యవహరించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బ్యూరోక్రసీకి ఒక బలమైన హెచ్చరికను పంపారు. గతంలో తాను ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అదే సమయంలో నిబంధనల ప్రకారం పనిచేసే అధికారులకు ఆయన ఒక భరోసానిచ్చారు. కాలుష్య కారక సంస్థలపై లేదా అక్రమార్కులపై చర్యలు తీసుకునేటప్పుడు మీకు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదనీ.. ఆ విషయాలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. అవసరమైతే ఆ ఒత్తిళ్లపై తాను క్యాబినెట్ సమావేశంలోనో, అసెంబ్లీ వేదికగానో ప్రశ్నిస్తానని, అధికారులకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా అడ్మినిస్ట్రేషన్ తన పని తాను నిష్పక్షపాతంగా చేయాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.
http://www.teluguone.com/news/content/even-deputy-pawan-orders-being-ignored-39-222301.html





