ప్రోత్సాహానికి కేరాఫ్ అడ్రస్ మీరే కావచ్చు…
Publish Date:Sep 12, 2023
Advertisement
అరేయ్ నువ్వు చేయగలవురా నీ వల్ల అవుతుంది. నీ గురించి నీకు అర్థం కావడం లేదు, హనుమంతుడికి తన బలం తనకే తెలియనట్టు.. నువ్వు కూడా ఇంతే.. ఊరికే ఎలాంటి అనుమానాలు, భయాలు పెట్టుకోకుండా నువ్వు అనుకున్నది చెయ్యి.. నీ వెంట నేనుంటా కదా…
ఇలాంటి మాటలు ప్రతి మనిషి జీవితంలో ఉంటే బహుశా ఓటమి ఎదురవ్వడం అనే సందర్భం రాదేమో. ఓ మనిషిని ప్రోత్సహించాలన్నా, వెనక్కు లాగాలన్నా అదంతా ఇంకొక మనిషి చేతిలో ఉంటుంది. ప్రతిభ ఉండి, ఆత్మవిశ్వాసం ఉండి కూడా ఒక్కో సందర్భంలో ఇతరులు నిరాశ పరచడం ద్వారా విఫలం అయ్యేవారు చాలామందే ఉంటారు. అందుకే ప్రోత్సాహం గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. బద్దకస్తుడిని కూడా పరుగులు పెట్టిస్తుంది.
ప్రోత్సాహంలో ఉన్న గొప్పదనాన్ని, ప్రోత్సాహం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఏడు సెప్టెంబర్ 12 ను నేషనల్ ఎంకరేజ్మెంట్ డే ని జరుపుకుంటారు. దీన్ని జాతీయ ప్రోత్సాహ దినోత్సవం అని తెలుగులో పిలుస్తారు. ఈరోజు ఏం చేయవచ్చంటే..
పిల్లలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం..
ప్రతి మనిషి మొదట తన ఇంటిని బాగు చేసుకుంటే ఆ తరువాత సమాజాన్ని బాగు చేయడానికి అర్హుడు అవుతాడు అని అంటారు. దానికి అనుగుణంగానే… కుటుంబ సభ్యులు, పిల్లలు, తోడబుట్టిన వారు, పెద్దలు ఇలా ప్రతి ఒక్కరూ ఏవైనా పనులలో కానీ, మరేదైనా విషయంలో కానీ జంకుతున్నా, సందిగ్ధంలో ఉన్నా వారికి ధైర్యం చెప్పి ఎంకరేజ్ చెయ్యాలి. దీనివల్ల వారికి ఎక్కడలేని ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. కుటుంబ సభ్యులు విజేతలు అయినా, ఎదైనా సాధించినా పరోక్షంగా అధి ఆ ఇంటి విజయం అవుతుంది. కాబట్టి పిల్లలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి.
పేదవారిని, స్నేహితులను వదలొద్దు..
పేదరికం కారణంగా ప్రతిభ ఉన్నా మరుగున ఉంటున్న పిల్లలు, యువత ఎంతోమంది ఉన్నారు. అందరినీ భుజాన వేసుకోకపోయినా వారికి కాస్త ఆర్థిక సాయం, మరికాస్త ధైర్యం చెబితే ఊహించని విధంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే తల్లిదండ్రులలో కూడా చెప్పుకోలేని విషయాలు స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి స్నేహితులను వైఫల్యం బాటలో వదిలేయకుండా వారిని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ముందు తోయాలి. అప్పుడు వారి విజయంలో మీరు భాగమవుతారు.
కళాకారులు, ప్రతిభ గలవారిని ప్రోత్సహించాలి..
కళను తమలో నింపుకున్నవారు కళాకారులు. కానీ చాలావరకు కళలు కడుపు నింపవు అనే మాట వాస్తవ చిత్రంగా అందరికీ కళ్లెదుటే కనిపిస్తుంటుంది. ప్రతిభ కలిగిన కళాకారులను ఎంకరేజ్ చెయ్యాలి. ఏ వర్గంలో అయినా ప్రతిభ ఉంటే వారిని చేతనైన విధంగా మాటలతోనూ, ఆర్థికంగానూ సహాయం అందించాలి.
http://www.teluguone.com/news/content/enchorage-with-little-ways-35-161582.html