ఖాళీకడుపు మీద ఇవి అస్సలు తినకూడదట!
Publish Date:Jun 28, 2017
Advertisement
ఉదయం లేవగానే కడుపు నకనకలాడిపోతుంటుంది. ఏదో ఒకటి పొట్టలో పడకపోతే, మనసంతా చిరాగ్గా మారిపోతుంది. కానీ ఆకలి తీర్చుకునే ధ్యాసలో ఏదిపడితే అది తినేస్తే మాత్రం... ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమంటున్నారు. అలా ఖాళీ కడుపుకి దూరంగా ఉంచాల్సిన పదార్థాలు కొన్నింటిని సూచిస్తున్నారు... ఆరటిపళ్లు ఉదయాన్నే తినేందుకు ఏదీ కనిపించకపోతే ఓ అరటిపండుని నమిలిపారేస్తాం. అరటిపండులో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఖాళీకడుపున జీర్ణమయ్యే ఈ మెగ్నీషియం గుండె, నాడీవ్యవస్థ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందట! మసాలాలు ఉదయాన్నే వేడివేడి సమోసానో, నోరూరించే పరోటా కుర్మానో తినేస్తుంటారు. ఖాళీ కడుపు మీద ఇలా పచ్చిమిర్చి, మసాలాలు దట్టించిన ఆహారం తినడం వల్ల పేగులు దెబ్బతిని అల్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. పైగా ఇలాంటి ఘాటైన పదార్థాల వల్ల జీర్ణరసాలు ఎక్కువగా ఊరి అసెడిటీకి కూడా దారితీస్తాయట. టీ – కాఫీ కాఫీ,టీలలో ఉండే కెఫిన్ వల్ల తాగిన వెంటనే కాస్త ఉత్సాహంగా ఉంటే ఉండవచ్చుగాక! కానీ ఖాళీ కడుపున ఇవి పుచ్చుకుంటే మాత్రం అజీర్ణం తప్పదంటున్నారు. అంతేకాదు! పరగడుపున తాగే టీ, కాఫీలు బైల్ అనే రసాయనం ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయట. దానివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి, ఊబకాయం వంటి సమస్యలు రావచ్చునంటున్నారు. కాబట్టి టీ, కాఫీలు అలవాటు ఉన్నవారు... అల్పాహారం తిన్న తరువాతనో, ఓ గ్లాసుడు మంచినీరు తాగిన తర్వాతనో మాత్రమే వాటిని పుచ్చుకోవాలని సూచిస్తున్నారు. తీపిపదార్థాలు పరగడుపున చాక్లెట్లు, స్వీట్స్, జ్యూసులు, కూల్డ్రింక్స్ వంటి తీపిపదార్ధాలు తీసుకోవడం అంటే లివర్ నెత్తిన ఇంత విషం పోయడమే అంటున్నారు. మద్యం తాగడం వల్ల లివర్ మీద ఎంత భారం పడుతుందో... ఖాళీ కడుపున తీపి తినడం వల్ల కూడా అంతే ప్రమాదమట! టమాటాలు చూస్తూ చూస్తూ ఎవరూ పరగడుపున టమాటాలు తినరనుకోండి. కానీ చపాతీలలోకో, సలాడ్లలో భాగంగానో పచ్చి టమాటాలు తినే అలవాటు మాత్రం చాలామందికి ఉంటుంది. టమాటాలలో ఉండే ‘టేనిక్ యాసిడ్’ అనే రసాయనం జీర్ణవ్యవస్థని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందట! పచ్చికూరలు ఉదయం లేవగానే దోసెలు,పూరీలులాంటి నూనెపదార్థాల బదులు చక్కగా పచ్చికూరలు తినవచ్చు కదా! అన్న ఆలోచన రావడం మంచిదే. కానీ మన శరీరం పచ్చి ఆహారాన్ని తినే అలవాటు నుంచి దూరమై చాలా శతాబ్దాలే గడిచిపోయింది కదా! అలాంటి శరీరంలోకి ఇప్పుడ అకస్మాత్తుగా ఖాళీకడుపున పచ్చికూరలు వేస్తే... వాటిలోని పీచు పదార్థాలతో పేగులు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదంటున్నారు. కాబట్టి జీర్ణవ్యవస్థ బాగోలేనివారు పరగడుపున ఈ పచ్చికూరలకి దూరంగా ఉండమని సూచిస్తున్నారు. ఇవే కాదు- పుల్లటి పళ్లు, మద్యం, బేకరీ పదార్థాలు కూడా పరగడుపున మంచిది కాదని సూచిస్తున్నారు. - నిర్జర.
http://www.teluguone.com/news/content/empty-stomach-35-75894.html





